తస్సాదియ్యా... ఇప్పుడిది ఎవరి ఖాతాలో వేయాలి!!
సో.. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు విజయవాడలో కీలకమైన బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ఎదురుగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైవోర్ విషయానికి వద్దాం
By: Tupaki Desk | 27 Nov 2023 3:15 AM GMTరాజకీయాలంటే.. ప్రత్యర్థులపై విరుచుకుపడడమే కాదు. ప్రాజెక్టులకు సంబంధించిన గొప్పలు కూడా చెప్పుకోవడమే! ఇది మా హయాంలోనే శంకు స్థాపన చేశాం.. సగం నిర్మాణం కూడా పూర్తయింది.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి. వారి పేరు వేసుకున్నారు.. అని ఒకపార్టీ. కాదుకాదు.. అంతా ఉత్తిదే.. అసలు పూర్తి చేసింది మేమే.. కాబట్టి ఆ క్రెడిట్ మాకే దక్కుతుంది! అనే పార్టీ ఇంకోవైపు.. ! ఇదంతా ఐదేళ్ల కోసారి ప్రభుత్వాలు మారే రాష్ట్రాల్లో కామన్‌గా కనిపిస్తున్న విషయం.
ఇప్పుడుఏపీలోనూ ఇదే జరుగుతోంది. గత చంద్రబాబు హయాంలో ప్రారంభించి, శంకుస్థాపన చేసి.. 90 శాతం పూర్తి చేసిన కట్టడాలను, ప్రాజెక్టులను కేవలం 10 శాతం పూర్తి చేసి.. రంగులేయించి.. తమ పేరు పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారని.. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వైసీపీపైనిప్పులు చెరుగుతోంది. కట్ చేస్తే.. అదేం లేదు.. వారు 10 శాతం చేస్తే.. మొత్తం 90 శాతం మేమే చేశాం.. ఇదీ మాఘనతేనని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ రెండు పార్టీలూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.
సో.. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు విజయవాడలో కీలకమైన బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ఎదురుగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైవోర్ విషయానికి వద్దాం. దీనిని పూర్తి చేసేందుకు సుమారు 8 ఏళ్లు పట్టింది. చంద్రబాబు హయాం నుంచి జగన్ పాలన వరకు ఈ నిర్మాణం సాగింది. మొత్తానికి ఈ నిర్మాణం పూర్తియి.. కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్ చేతుల మీదుగా 2020లో అందుబాలోవచ్చింది. అప్పట్లో టీడీపీ ఈ క్రెడిట్ తమదేనని చెప్పింది. కాదు.. ఇది మా ఘనత.. మా సీఎం ఘనత అని వైసీపీ ఢంకా భజాయించింది.
మొత్తానికి ఎవరు ఎలా చెప్పుకొన్నా.. ఫ్లైవోర్ అందుబాటులోకి వచ్చి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అయితే.. గత నాలుగు రోజుల నుంచి ఈ ఫ్లైవోర్ హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన వేసిన.. పైకప్పు శ్లాబు అచ్చులు అచ్చులుగా ఊడి పడుతున్నాయి. ఫ్లైవో ర్ అంతా కూడా ఇలానే ఉంది. ఓ రిక్షా కార్మికుడికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. దీంతో ఈ ఫ్లైవోర్ నిర్మాణంలో అవినీతి జరిగిందని కామ్రెడ్స్ జెండాలు పట్టుకున్నారు.
అయితే.. ఆది నుంచి ఈ ఫ్లైవోర్ క్రెడిట్ కోసం తన్నుకున్న వైసీపీ, టీడీపీలు మాత్రం మౌనం పాటించాయి. ఎవరూ నోరు విప్పడం లేదు. వాస్తవానికి ఎన్నికల సమయం కావడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాలి. కానీ.. దీనిని ఎవరికి వారు తమ హయాంలోనే కట్టిందని చెప్పుకోవడంతో ఇప్పుడు లోపాలు బయట పడే సరికి.. ఎవరికి వారు తేలు కుట్టినట్టు మౌనంగా ఉండిపోయారు. ఇదీ.. సంగతి! ఇదీ రాజకీయం!!