జనసేనకే సినిమా శాఖ... కందుల దుర్గేష్ నిర్మాతని తెలుసా?
ఏపీలో నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jun 2024 2:30 PM GMTఏపీలో నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయగా.. పవన్ తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అధినేతగా ఉన్న జనసేనకే సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించారు.
అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సమయంలో నేడు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇందులో భాగంగా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ & టెక్నాలజీ వంటి కీలక శాఖలను కేటాయించారు. ఇదే సమయంలో జనసేన పార్టీ నేతకే సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించబడింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ సినిమాటోగ్రఫీ శాఖ ఎవరికి ఇస్తారనే చర్చ జరిగింది. పైగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ఉన్న ప్రభుత్వం కావడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే చాలా మంది భావించినట్లుగానే ఆ శాఖ జనసేనకు దక్కింది. ఇందులో భాగంగా నిడదవోలు నుంచి పోటీ చేసి గెలిచిన కందుల దుర్గేష్ కు ఈ శాఖను కేటాయించారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేష్ కు సినిమాలకూ ఏమిటి సంబంధం అనే చర్చ తెరపైకి వచ్చింది! అయితే... చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... కందుల దుర్గేష్ 1991లోనే నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో భాగంగా భానుచందర్, శోభన హీరో హీరోయిన్లుగా నటించిన "కీచురాళ్లు" సినిమాకు ఆయన నిర్మాతగా ఉన్నారు. ఆ సినిమాకి గీతాకృష్ణ దర్శకులు కాగా... ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
ఇదే సమయంలో ఆ కీచురాళ్లు సినిమాతోపాటు తదనంతర కాలంలో పలు సినిమాలకూ నిర్మాతగా వ్యవహరించారని.. ఆయనకు సినిమా ఇండస్ట్రీపై అవగాహనే కాదు అవసరైనమేర పరిజ్ఞానం కూడా ఉందని అంటున్నారు. దీంతో... ఈ శాఖకు కందుల దుర్గేష్ మంచి ఆప్షనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీ గా పనిచేసిన కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్.. అలియాస్ కందుల దుర్గేష్... అనంతరం జనసేనలో చేరి తొలినుంచీ కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈ ఎన్నికల్లో గెలిచి మంత్రిపదవి చేపట్టారు. మరి ఈయన ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ శాఖ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.