రైతు చట్టాలపై కామెంట్.. క్షమాపణలు కోరిన కంగన
నోరు అదుపు తప్పితే.. మాట జారితే.. దాని దుష్పరిణామం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా ఎదుర్కొంది కంగన రనౌత్.
By: Tupaki Desk | 25 Sep 2024 7:30 AM GMTనోరు అదుపు తప్పితే.. మాట జారితే.. దాని దుష్పరిణామం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా ఎదుర్కొంది కంగన రనౌత్. నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడేస్తే ఎంత ప్రమాదమో అనుభవమైంది. తన జీవితంలో ఇలా మెట్టు దిగి రావడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. కానీ మెట్టు దిగింది. చాలా ఆశ్చర్యపరుస్తూ కంగన అందరి ముందూ బిగ్ సారీ చెప్పింది. అది కూడా రైతులందరికీ తన తరపున క్షమాపణలు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి కంగనా రనౌత్ 2020లో రైతుల నిరసనకు ప్రధానమైన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని తాను చేసిన వ్యాఖ్యకు `పశ్చాత్తాపపడుతున్నాను` అని తాజా మీడియా సమావేశంలో అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తన లోక్‌సభ నియోజకవర్గం మండిలో మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ.. భారీ ఆందోళనల తర్వాత (2021 నవంబర్‌లో) ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకురావాలని కోరుతున్నా.. అని అన్నారు. వివాదంపై కంగన మరింతగా మాట్లాడుతూ-``ఇది వివాదాస్పదమవుతుందని నాకు తెలుసు.. కానీ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని నేను భావిస్తున్నాను. రైతులే దానిని డిమాండ్ చేయాలి. వారు దేశాభివృద్ధికి బలమైన స్తంభం. నేను వారికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను - డిమాండ్ చేస్తే మీ మేలు కోసం చట్టాలు తిరిగి వస్తాయి`` అని కంగనా రనౌత్ అన్నారు.
అయితే కంగన వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉంది. పార్టీ అభిప్రాయాలకు తాను ప్రాతినిధ్యం వహించడం లేదని కూడా విలేకరులతో కంగన అంది. కంగనా రనౌత్‌కు బీజేపీ తరపున అలాంటి ప్రకటన చేసే అధికారం లేదని, వ్యవసాయ బిల్లులపై బీజేపీ అభిప్రాయాన్ని ఇది ప్రదర్శించదని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. మిస్టర్ భాటియా ప్రకటనపై కంగన ప్రతిస్పందిస్తూ -``వ్యవసాయ చట్టాలపై నా అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. అవి ఆ బిల్లులపై పార్టీ వైఖరికి ప్రాతినిధ్యం వహించవు`` అని కూడా అన్నారు.
క్వీన్ ఒక వీడియో స్టేట్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. తన వ్యాఖ్యలతో చాలా మంది నిరాశ చెందారు అని అన్నారు. నేను కళాకారిణిని మాత్రమే కాకుండా బిజెపి కార్యకర్తను కూడా అని గుర్తుంచుకోవాలి. నా వ్యాఖ్యలు ఎవరినైనా నిరుత్సాహపరిచినట్లయితే నేను చింతిస్తున్నాను అని అన్నారు. వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని కోరారు.
`ఎమర్జెన్సీ` సెన్సార్ సర్టిఫికేట్ కోసం పోరాడుతున్న కంగన రనౌత్ రైతుల నిరసనలపై ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ గత నెలలో ఒకసారి మందలించింది. అనంతరం కంగన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
అసలు గొడవేంటి?
2020లో రైతుల నిరసనలు ఊపందుకోవడంతో కంగన పంజాబ్‌కు చెందిన మహిళా రైతును తప్పుగా గుర్తించి, ఆమెను బిల్కిస్ బానో అని కామెంట్ చేసింది. కేంద్రం గట్టి చర్యలు తీసుకోకుంటే రైతుల నిరసనల సందర్భంగా భారత్‌లో బంగ్లాదేశ్ తరహా పరిస్థితి తలెత్తేదని కంగన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్‌లో కంగనా రనౌత్ ని మహిళా సీఐఎస్‌ఎఫ్ అధికారి చెంపదెబ్బ కొట్టిన తర్వాత పాత వివాదం మళ్లీ కొత్తగా తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్ - ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంగనా రనౌత్‌పై ఎదురు దాడి చేస్తూ.. ఈ నల్ల చట్టాలు (ఇప్పుడు తిరిగి తీసుకురాలేరు... మోడీ , ఆయన ఎంపీలు ఎంత ప్రయత్నించినా! అని దుయ్యబట్టాయి. 750 మందికి పైగా రైతులు అమరులయ్యారని.. అప్పుడే మోడీ ప్రభుత్వం మేల్కొని ఉండాల్సిందని.. ఇప్పుడు బీజేపీ ఎంపీలు వాటిని వెనక్కి తీసుకురావాలని యోచిస్తున్నారని.. కానీ కాంగ్రెస్ మాత్రం రైతుల వెంటే ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే అన్నారు.
ఆప్ పార్టీకి చెందిన నాయకుడు బల్బీర్ సింగ్ కూడా నటి కంగనపై అప్పట్లోనే విరుచుకుపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలు ఏమిటో ఆమెను అడగండి. సమాధానం చెప్పలేకపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఆమె చేస్తున్నదంతా కామెడీ. దయచేసి ఆమెను సీరియస్‌గా తీసుకోవద్దు! అని బల్బీర్ కంగనపై ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆప్ ఎంపీ మల్విందర్ సింగ్ కాంగ్ కూడా విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల పునరుద్ధరణ గురించి చర్చించడం ``దేశంలోని లక్షలాది మంది రైతులకు మరియు 750 మంది అమరులైన రైతులకు అవమానకరం`` అని అన్నారు.
కంగన రనౌత్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పర్యటించింది. అక్కడి నుండి లక్షలాది మంది రైతులు ఢిల్లీకి కవాతు చేశారు. నగరంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా పలు దిగ్బంధనాల్లో పాల్గొన్నారు.