Begin typing your search above and press return to search.

టెకీ ఆత్మ‌హ‌త్య‌.. న‌కిలీ ఫెమినిజంపై కంగ‌న ఫైర్!

న‌కిలీ ఫెమినిజాన్ని తిడుతూనే పురుష పుంగ‌వుల త‌ప్పుల‌ను కూడా కంగ‌న ఖండించారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 10:02 AM GMT
టెకీ ఆత్మ‌హ‌త్య‌.. న‌కిలీ ఫెమినిజంపై కంగ‌న ఫైర్!
X

న‌టి కం రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ బుధవారం న‌కిలీ ఫెమినిజంపై విరుచుకుప‌డ్డారు. బెంగళూరులో తన భార్య ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన టెక్కీ ప‌రిస్థితిని హృదయ విదారకమ‌ని అభివ‌ర్ణించ‌డ‌మే గాక‌.. డబ్బు దోపిడీ కోసం చట్టాలను దుర్వినియోగం చేసే మహిళల నకిలీ ఫెమినిజాన్ని తీవ్రంగా ఖండించారు. ''దేశమంతా షాక్‌లో ఉంది. మ‌ర‌ణించిన టెకీ వీడియో హృదయ విదారకంగా ఉంది. నకిలీ స్త్రీవాదాన్ని ఖండిస్తున్నాను. కోట్లాది రూపాయల దోపిడీ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 99 శాతం పెళ్లికి సంబంధించిన‌ కేసుల్లో పురుషులే తప్పు చేస్తున్నారు. అందుకే ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతుంటాయి'' అని కంగనా పీటీఐతో అన్నారు. న‌కిలీ ఫెమినిజాన్ని తిడుతూనే పురుష పుంగ‌వుల త‌ప్పుల‌ను కూడా కంగ‌న ఖండించారు.

తమ భార్యల వేధింపుల కేసుల్లో పురుషులకు చట్టపరమైన రక్షణ లేదని బెంగళూరు టెక్కీ సోదరుడు బుధవారం నాడు ఓ స‌మావేశంలో పేర్కొన్నాడు. నేరం తీవ్రమైన‌దే అయినా కానీ.. ఈ కేసులో అరెస్టులు చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. త‌మ‌ కుటుంబం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంద‌ని హెచ్చ‌రించాడు. మగవారు కూడా వేధింపులకు గురవుతున్నందున వారి కోసం కూడా చట్టాలు రూపొందించాల‌ని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవాల‌ని అన్నారు. స్త్రీ జీవితం ఎంత ముఖ్యమో.., పురుషుడి ప్రాణం కూడా అంతే ముఖ్యమ‌ని వ్యాఖ్యానించారు.

మోదీని ఆక్షేపించిన‌ నెటిజ‌నం

పీఎం న‌రేంద్ర‌మోదీని కపూర్ కుటుంబం క‌లిసిన‌ప్ప‌టి ఫోటోలు ఇటీవ‌ల‌ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. ఈ శనివారం నాడు శ‌త జన్మదినోత్సవం జరుపుకోనున్న సినీ ఐకాన్ రాజ్ కపూర్ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌, ప్ర‌త్యేక‌ ఉత్సవాల‌కు అతిథిగా రావాల్సిందిగా క‌పూర్ కుటుంబం మోదీజీని ఆహ్వానించింది. ఈ స‌మావేశంలో క‌పూర్ కుటుంబీకులు ర‌ణ‌బీర్ క‌పూర్, క‌రీనా క‌పూర్ ఖాన్ స‌హా ఆలియా భ‌ట్ కూడా క‌నిపించారు. అయితే సినీప్ర‌ముఖుల్లో క‌పూర్ లకు పీఎం స్థాయి వ్య‌క్తి నుంచి అనుమ‌తులు రావ‌డంపైనా, వారికి రాచ‌రిక‌పు మ‌ర్యాద‌ల‌ను అందించ‌డంపైనా నెటిజ‌నులు విరుచుకుప‌డుతున్నారు. ప‌నిలోప‌నిగా కంగనా రనౌత్ పాత వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు. మండి పార్లమెంట్ నుంచి లోక్‌సభ సభ్యురాలు అయిన కంగ‌న తాను పీఎం మోదీని క‌ల‌వ‌లేక‌పోయాన‌ని ఇదివ‌ర‌కూ వెల్ల‌డించారు.

మండీలో త‌న ర్యాలీకి విచ్చేసినా కానీ...త‌న‌తో మాట్లాడేందుకు ప్ర‌ధానికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం దొరకలేదు. ఈ వీడియో చూసిన ప్ర‌జ‌లు మోదీజీని ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. దేశ ప్ర‌ధాని ప్రాధాన్య‌త‌లు మారాల‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. పార్టీ ఎంపీని క‌ల‌వ‌క‌పోయినా కానీ, ఇలా పెద్ద సినీకుటుంబాన్ని క‌లిసే స‌మ‌యం ఉంది అంటూ పీఎంని ఆక్షేపించారు.