కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు.. కన్నెర్ర జేసిన బీజేపీ పెద్దలు!
అవును... రైతు ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు మన దేశంలోనూ వచ్చి ఉండేవంటూ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 26 Aug 2024 1:10 PM GMTబాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతు ఆందోళనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అయితే దేనిపై అయినా, ఎలా అయినా మాట్లాడొచ్చు.. అధికార పార్టీలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు అనుకున్నారో ఏమో కానీ... రైతుల ఉద్యమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో... బీజేపీ అధిష్టాణం అలర్ట్ అయ్యింది.. ఆమె వ్యాఖ్యలకూ, పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసలు ఆమెకు పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసే అనుమతి లేదని తేల్చింది!
అవును... రైతు ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు మన దేశంలోనూ వచ్చి ఉండేవంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. దీంతో స్పందించిన బీజేపీ అధిష్టాణం... రైతుల ఉద్యమం సందర్భంలో కంగనా ఇచ్చిన ప్రకటన తమ పార్టీ అభిప్రాయం కాదని వెల్లడించింది.
ఇదే సమయంలో... కంగానా రనౌత్ కు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విధానపరమైన అంశాలపై మాట్లాడే అనుమతి కానీ, అధికారం కానీ లేదని పేర్కొంది. బీజేపీ... సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సామాజిక సామరస్య సూత్రాలను అనుసరించాలని నిశ్చయించుకుందని పేర్కొంది. ఇదే సమయంలో.. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు చేయొద్దంటూ కంగనాకు హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.
కాగా... రైతుల నిరసనలను కట్టడి చేసేందుకు మోడీ సర్కార్ గట్టి చర్యలు తీసుకుని ఉంటే అవి బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో డెడ్ బాడీలు వేలాడుతూ కనిపించాయని.. లైంగిక దాడులు చోటు చేసుకున్నాయని ఆమె ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు.
ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నా కూడా నిరసనలు కొనసాగేలా విదేశీ శక్తులు, స్వార్థప్రయోజనాలు ఆశించేవారు ప్రోత్సహించారని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో దేశం కుక్కలపాలైనా అది వారికి పట్టదని విమర్శలు చేశారు. దీంతో... ఈ వ్యాఖ్యలు సొంతపార్టీలోనే పెను దుమారం లేపాయి. దీంతో స్పందంచిన బీజేపీ ఆ వ్యాఖ్యలకు పార్టీకీ ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఆమెకు కూడా కాస్త గట్టి క్లాసే పడిందని అంటున్నారు!