Begin typing your search above and press return to search.

ఏడు పదుల వయసులో మరో పార్టీ వైపు చూడాల్సిందేనా ?

ప్రస్తుతం ఆయన వాయిస్ ఎక్కడ అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఆయనది నిజంగా పెద్ద గొంతుక. ఆయన సెటైర్లు కామెంట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి.

By:  Tupaki Desk   |   13 March 2025 6:00 AM IST
ఏడు పదుల వయసులో మరో పార్టీ వైపు చూడాల్సిందేనా ?
X

ఆయన దిగ్గజ నాయకుడు. రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న వారు. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత వివిధ మంత్రివర్గాలలో కీలకమైన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసారు. ఆయనే సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అయిన కన్నా లక్ష్మీనారాయణ.

ప్రస్తుతం ఆయన వాయిస్ ఎక్కడ అన్నది ఏపీ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఆయనది నిజంగా పెద్ద గొంతుక. ఆయన సెటైర్లు కామెంట్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. 2024 ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఆ సమయంలో ఆయన రాజకీయం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఆయన టీడీపీలో చేరుతారా లేక జనసేనలోనా అన్నంతగా ఆయన గురించి అంతా ఫోకస్ పెట్టారు.

కీలక నేతలు ఆయన ఇంటికి వెళ్ళి కూడా మంతనాలు జరిపారు. ఆయన ప్రాముఖ్యత ఆ స్థాయిలో ఉండేది. చివరికి కన్నా లక్ష్మీనారాయణ సైకిలెక్కేశారు. ఆయన టీడీపీని బెస్ట్ చాయిస్ గా ఎంచుకున్నారు. ఆయనకు సత్తెనపల్లి సీటుని కేటాయించింది ఆ పార్టీ. అక్కడ ఉన్న కోడెల ఫ్యామిలీ రాయపాటి ఫ్యామిలీని కూడా కాదని బెర్త్ కన్ ఫర్మ్ చేశారు.

ఎన్నికలకు ముందు టీడీపీలో అభ్యర్థుల ఎంపికకు చాలా ముందు ఈ పరిణామం జరిగేసరికి టీడీపీలో కన్నా ప్రాభవం ఇది అన్నట్లుగా ఒక రేంజిలో ఆయన గురించి వార్తా కధనాలు వచ్చాయి. ఇక ఆయన 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో సత్తెనపల్లిలో గెలిచారు. అయితే గెలిచిన సంబరం ఆయనకు ఆ తరువాతనే ఆవిరి అయింది అని అంటున్నారు.

మంత్రివర్గంలో ఆయన పేరు కచ్చితంగా ఉంటుందని భావించినా కూడా ఎక్కడా కనిపించలేదు. దాంతోనే ఆయన డీలా పడ్డారు అని అంటున్నారు. ఇక ఆయన సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీలో కూడా ఇలా వచ్చి ఆలా కూర్చుంటున్నరు తప్ప ఏమీ మాట్లాడటం లేదు. పార్టీ వేదికల మీద కనిపించడం లేదు

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఇంతలా మూగనోము పట్టడానికి కారణం ఆయనలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆయన కుమారుడు నియోజకవర్గంలో తనదైన శైలిలో హవా చలాయిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో కోడెల వర్గం కూడా బలంగా ఉంది. అలా వర్గ పోరు సాగుతున్నా పెద్దాయనగా కన్నా మాత్రం అసలు జోక్యం చేసుకోవడం లేదు అని అంటున్నారు.

ఇక చూస్తే కన్నాకు 2014 నుంచి మంత్రి యోగం లేకుండా పోయింది. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరినా మంత్రి పదవి దక్కేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్న ఈ పెద్దాయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీ మారే పరిస్థితి వస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా కన్నా రాజకీయం మాత్రం అనుకున్నంతగా విజయవంతం కావడం లేదు అని అంటున్నారు ఆయన అనుచరులు.