టెన్షన్ లో వైసీపీ రాజు గారు...!?
దానికి తోడు ఆయన నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. అలాగే బీసీలు ఉన్నారు.
By: Tupaki Desk | 22 Jan 2024 4:23 AM GMTవైసీపీ అయిదవ జాబితా త్వరలో బయటకు వస్తోంది అని అంటున్నారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి ఇబ్బంది కలుగుతుంది సీట్లు మారేది ఎవరికి అన్న చర్చ వస్తోంది. అలా చూసుకుంటే ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు వైపు అందరి చూపూ పడుతోంది. ఆయన గ్రాఫ్ తగ్గింది అని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాట.
దానికి తోడు ఆయన నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. అలాగే బీసీలు ఉన్నారు. దాంతో ఓసీ కి బదులుగా ఈ సీటుని బీసీలకు అయినా కాపులకు అయినా ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు ఇక చూస్తే 2019 ఎన్నికల్లో ఇద్దరు రాజులకు వైసీపీ టికెట్ ఇచ్చింది. అందులో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన కేకే రాజు ఓటమి పాలు అయ్యారు.
ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో 2024లో కూడా ఆయనకే టికెట్ అని అంటున్నారు నిజానికి విశాఖ నార్త్ లో కూడా కాపులు ఎక్కువగా ఉన్నారు. అయితే రాజులు కూడా గెలుస్తూ వస్తున్నారు దాంతో ఆ సీటు కేకే రాజుకు ఫిక్స్ అయింది. దీంతో రెండవ సీటును క్షత్రియులకు కాకుండా బీసీలకు ఇవ్వాలని వైసీపీ హై కమాండ్ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
వైసీపీ అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ బొడ్డేడ ప్రసాద్ కి ఎలమంచిలి టికెట్ ఇస్తారని అంటున్నారు. ఆయన బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన వారు. అనకాపల్లి జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలలో గవరలు రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అనకాపల్లి అసెంబ్లీకి ఇంచార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన మలసాల భరత్ కుమార్ ని ఎంపిక చేశారు.
దాంతో గవరలకు ఎలమంచిలిలో ప్లేస్ చూపించి అకామిడేట్ చేయవచ్చు అని అంటున్నారు ఇక్కడ జనసేన టీడీపీ కూటమి నుంచి జనసేన అభ్యర్ధిగా సుందరపు విజయకుమార్ పోటీ చేయబోతున్నారు. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. దంతో వైసీపీ బీసీల నుంచి క్యాండిడేట్ ని పెట్టాలని చూస్తోంది.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాత్రం టికెట్ కోసం పట్టుబడుతున్నారు అని అంటున్నారు. తనకు కాకపోయినా తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు ఈ మేరకు ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ హై కమాండ్ మాత్రం బీసీ కార్డు తోనే ఎలమంచిలి కొట్టాలని చూస్తోంది.
మొత్తం మీద చూసుకుంటే కనుక ఈసారి వచ్చే లిస్ట్ లో ఎలమంచిలి ఉంటుందేమో అన్న టెన్షన్ లో రాజుగారు ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరి కొత్త లిస్ట్ ఎపుడు వస్తుందో అందులో ఎవరి పేర్లు ఉంటాయో అంతా ఉత్కంఠ గా ఉంది మరి.