ఇంగ్లీష్ వర్సెస్ కన్నడ.. ఇదో రగడ.. దేశంలో కలకలం
భాషాభిమానం అందరికీ ఉంటుంది. ఎవరి భాషను వారు ఇష్టపడతారు. అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మరింత పెరిగింది
By: Tupaki Desk | 28 Dec 2023 5:42 AM GMTభాషాభిమానం అందరికీ ఉంటుంది. ఎవరి భాషను వారు ఇష్టపడతారు. అయితే.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మరింత పెరిగింది. స్వభాషను ప్రేమించేవారే కాదు.. స్వభాషను ఆచరించాలని పట్టుబడుతున్న వారు కూడా పెరుగుతన్నారు. ఈ క్రమంలో కర్ణాట కలో వెలుగు చూసిన వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా '60 శాతం కన్నడ' పేరుతో ఓ ఉద్యమం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో వ్యాపారాలు నిర్వహించుకునేవారు.. తమ దుకాణాల ముందు ఏర్పాటు చేసుకునే సైన్ బోర్డులపై ఆయా దుకాణాల వివరాలను దుకాణ దారులు సహజంగా ఇంగ్లీష్‌లోనే రాసుకుంటారు.
అయితే.. ఇలా ఇంగ్లీష్‌లో ఉన్న సైన్ బోర్డుల కారణంగా కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందని పేర్కొంటూ.. కర్ణాటక రక్షణ వేదిక ఉద్యమానికి తెరదీసింది. వాణిజ్య వ్యాపార సంస్థల సైన్ బోర్డులపై '60శాతం కన్నడ' అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని పట్టుబడుతోంది. దీనిలో భాగంగా బెంగళూరులో ఈ కర్ణాటక రక్షణ వేదిక నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న సైన్‌బోర్డులను తొలగించారు.
కన్నడలో సైన్‌బోర్డులకు సంబంధించి బెంగళూరు నగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండు చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరులో ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని పలు దుకాణాల సైన్ బోర్డులను తొలగించేందుకు యత్నించారు. హోటళ్లు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లపై నల్లరంగు చల్లారు. ఆందోళనకారుల చర్యలను అడ్డుకున్న పోలీసులు.. వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు జారీ
వివిధ వాణిజ్య సంస్థలు కన్నడ భాషలో బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాల సైన్ బోర్డుల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధన ఫిబ్రవరి చివర నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.