Begin typing your search above and press return to search.

కన్నాకు సత్తెనపల్లి ట్రబుల్స్.. ఆయన ఇండిపెండెంట్ గా...?

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత.

By:  Tupaki Desk   |   7 Aug 2023 2:30 AM GMT
కన్నాకు సత్తెనపల్లి ట్రబుల్స్.. ఆయన ఇండిపెండెంట్ గా...?
X

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత. ఆయన 1989లో రాజకీయాల్లోకి వచ్చి ఆ టెర్మ్ లోనే మొదటిసారి మంత్రి అయ్యారు. ఆ తరువాత 2004 నుంచి 2014 దాకా పదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీలో సాగిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు.

అలా 1989 నుంచి 2014 దాకా 26 ఏళ్ళ పాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన కన్నాకు గత తొమ్మిదేళ్ళ నుంచ్ పొలిటికల్ గా బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. 2019 నాటికి బీజేపీ గూటికి చేరి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. అప్పట్లో టీడీపీతో పొత్తులు తెగిపోవడంతో కన్నాతో పాటు అంతా ఓటమి పాలు అయ్యారు.

ఇక బీజేపీతో లాభం లేదనుకుని కన్నా టీడీపీలోకి జంప్ చేశారు. ఆయనను ఏరి కోరి మరీ సత్తెనపల్లి బరిలోకి చంద్రబాబు దించుతున్నారు. అయితే ఇక్కడే కన్నాకు మరోసారి బ్యాడ్ లక్ వెంటాడుతోందా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

సత్తెనపల్లిలో 2014లో గెలిచి స్పీకర్ అయిన కోడెల్ శివప్రసాదరావు 2019లో కూడా మరోసారి పోటీ చేశారు. ఒక విధంగా ఇది కోడెల సీటు అని ఆయన తనయుడు శివరాం అంటున్నారు. పైగా తమ సొంత ఊరు కూడా సత్తెనపల్లిలో ఉందని, ఇది తన తండ్రి సీటు, తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

కోడెల మరణాంతరం శివరాం సత్తెనపల్లిలో టీడీపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఆయన తయారు చేసుకున్నారు. కన్నాకు సత్తెనపల్లి ఇంచార్జిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించడం పట్ల శివరాం గుస్సా అవుతున్నారు. టీడీపీలో అందరికీ ఒక సంప్రదాయం కోడెల ఫ్యామిలీకి మరో సంప్రదాయమా అని ఆయన మండిపోతున్నారు.

తండ్రుల సీటుని వారసులకు ఇచ్చిన టీడీపీ సత్తెనపల్లిలో మాత్రం తనకు అన్యాయం చేస్తోందని మీడియా ముందే ఆయన చెప్పుకొచ్చారు. ఇక సత్తెనపల్లికే చెందని కన్నా లక్ష్మీ నారాయణకు ఈ సీటు ఎలా కేటాయిస్తారని ఆయన లాజిక్ పాయింట్ ని లేవనెత్తుతున్నారు దీంతో పాటు ఆయన తన కార్యక్రమాలను పెంచుకుంటూ పోతున్నారు.

ఎక్కడా తగ్గేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కూడా కోడెల శివరాం తీరు మీద ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. సత్తెనపల్లిలో పార్టీని చక్కదిద్దాలని ఆయన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులుకు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన కన్నా లక్ష్మీనారాయణకు కోడెల శివరాం ఆయన టీం సహకరించాలని కోరుతూ కోరారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.

ఆ నోటీసులు అన్నీ కోడెల వర్గానికే రావడం విశేష. అయితే ఈ నోటీసులకు కూడా జడిసేది లేదని కోడెల వర్గం స్పష్టం చేస్తోంది. పార్టీలో ఉంచితే ఉంచుకోండి. లేకపోతే వేటు వేసినా తాను బరిలో ఇండిపెండెంట్ గా నిలబడతాను అని ఆయన అంటున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సత్తెనపల్లి సీటు అటు టీడీపీకి ఇటు జనసేనకు ప్రాణప్రదంగా ఉంది. ఈ ఇద్దరు టార్గెట్ మంత్రి అంబటి రాంబాబు. ఆయన సత్తెనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, 2024లో కూడా ఆయనకే సీటును జగన్ ఇస్తున్నారు. మొదట అంబటిని కాదని జగన్ అనుకున్నా ఇపుడు కన్నా పట్ల కోడెల వర్గం అనుసరిస్తున్న వైఖరితో అంబటి వంటి సీనియర్ ఆ పరిణామాలను సొమ్ము చేసుకుంటారని వైసీపీ భావిస్తోంది.

మరో వైపు చూస్తే కాపు ఓట్ల మీదనే టీడీపీ కన్ను వేసింది. అందుకే రెండు సార్లు కోడెలకు ఇక్కడ టికెట్ ఇచ్చిన ఆ పార్టీ వ్యూహం మార్చి కన్నాకు బరిలోకి దించింది. ఇంకో వైపు చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం సత్తెనపల్లి వచ్చి కౌలు రైతులకు చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటిని ఆయన ఘాటుగా విమర్శించౌర్.

ఇలా చంద్రబాబు పవన్ ల టార్గెట్ గా ఉన్న అంబటిని ఓడించాలని కన్నను ముందు పెట్టారు. అయితే టీడీపీలో వర్గ పోరు కన్నా కొంప ముంచేలా ఉందని అంటున్నారు. కోడెల ఎక్కడా రాజీ పడడంలేదు. ఆయన తండ్రి చనిపోయాక టీడీపీ అధినాయకత్వం కనీసం పట్టించుకోలేదు అని ఆవేదన చెందుతున్నారు. అంతే కాదు, తన తండ్రి వారసత్వం తనకు కాకుండా పార్టీ చేస్తోందని అంటున్నారు.

సత్తెనపల్లిలో కన్నాకు సహకరించి గెలిపిస్తే రేపటి రోజున ఆ సీటు గురించి పూర్తిగా మరచిపోవాల్సిందే అని కోడెల వర్గం భయపడుతోంది. అందుకే పార్టీ ఓడినా తాము సత్తెనపల్లిలో నిలబడాలీ అంటే అయితే పార్టీ టికెట్ అయినా ఇవ్వాలి లేకపోతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి ఇదే శివరాం ఆలోచన అని అంటున్నారు.

కోడెల శివరాం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కచ్చితంగా అది కన్నాకు పెద్ద దెబ్బ అవుతుంది. కోడెల వర్గం బలంగా ఉంది. దాంతో ఓట్లు చీలి కన్నా ఓటమి పాలు అవుతారు అని అంటున్నారు. అది వైసీపీకి లాభం చేకూరుస్తుంది అని అంటున్నారు. దీంతో అధినాయకత్వం కోడెలను నయాన భయాన దారికి తీసుకుని రావడానికి చూస్తోంది అని అంటున్నారు. ఇక కన్నా 2024లో కూడా ఓటమి పాలు అయితే ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మసకబారుతుంది అని ఆయన వర్గం కలవరపడుతోంది.