యూపీలో హైటెన్షన్.. కన్వర్ యాత్రలో కల్లోలం!
యూపీలో పరమ పవిత్రంగా నిర్వహించే కన్వర్ యాత్ర వ్యవహారం.. ఆది నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 31 July 2024 9:32 AM GMTయూపీలో పరమ పవిత్రంగా నిర్వహించే కన్వర్ యాత్ర వ్యవహారం.. ఆది నుంచి వివాదంగా మారిన విషయం తెలిసిందే. కన్వర్ యాత్ర అంటే.. ఎక్కడెక్కడి నుంచో శివ భక్తులు గంగా నదికి వచ్చి కావిళ్లతో గంగా జలాలను తీసుకువెళ్లి.. వారి వారి స్వస్థలాల్లోని శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఆలయాలను ఈ నీళ్లతోనే శుద్ధి చేస్తారు. దీనికి ఉత్తరాదిలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే.. ఈ సారి ఆది నుంచి వివాదం అయింది. కన్వర్ యాత్ర జరిగే దారుల్లో హోటళ్ల యజమానులు వారి పేర్లు, కులం, మతాలను బోర్డులపై రాయాలని యూపీ సర్కారు ఆదేశించింది.
దీనిపై పెను వివాదం చోటు చేసుకుంది. అనంతరం సుప్రీంకోర్టు జోక్యంచేసుకున్ని `వెజ్జా-నాన్ వెజ్జా` అనేది రాస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ వ్యవహారంపైసుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. కన్వర్ యాత్ర సోమవారం మొదలైంది. ఈ క్రమంలో హరిద్వార్ సహా పలు ప్రాంతాల నుంచి కావిళ్లు మోసుకుని యువకులు.. మహిళలు.. గంగా నదికి(కాశీ గంగ)కు వస్తున్నారు. ఈ క్రమంలో ఓ మతానికి చెందిన కొందరు యువకులు రాంగ్ రూట్‌లో కారులో వచ్చి.. కావిళ్లను ఢీ కొట్టారు.
దీంతో కన్వర్ యాత్రికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కట్టలు తెగే కోపంతో కారులో వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. కావిళ్లకు ఉన్న కర్రలను తీసుకుని.. కారును ధ్వంసం చేశారు. అంతేకాదు.. కారులో ఉన్న నలుగురు యువకులను కూడా బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారు. వీరిలో ముగ్గురు యువకులు బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయట పడ్డారు. కానీ, మరో వ్యక్తి మాత్రం కన్వర్ యాత్రికులకు చిక్కిపోయాడు. దీంతో అతనిని చితకబాది బట్టలు కూడా తీయించారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. యువకులకు అండగా .. కొందరువచ్చి.. కన్వర్ యాత్రికు లపై తిరగబడేందుకు ప్రయత్నించారు. దీంతో ఒకరకంగా.. రణరంగం సృష్టించినట్టు అయింది. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు. ప్రస్తుతానికి ఈ మార్గంలో(కాశీ-హరిద్వార్) కన్వర్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బారికేడ్లు పెట్టి యాత్రికును అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. మరో వైపు.. ఈ ఘటనపై యోగి సర్కారు సీరియస్ అయింది. కన్వర్ యాత్రను అడ్డుకునేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందని.. దీనిని అడ్డుకుంటామని ఆయన సభలో ప్రకటించారు.