Begin typing your search above and press return to search.

ఈసారి కేఏ పాల్‌ పోటీ చేసేది ఇక్కడి నుంచే!

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని విశాఖ ఎంపీగా పోటీచేస్తానని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 2:30 PM GMT
ఈసారి కేఏ పాల్‌ పోటీ చేసేది ఇక్కడి నుంచే!
X

సీరియస్‌ పాలిటిక్స్‌లో ఆటలో అరటి పండు, కమెడియన్‌ గా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ను అందరూ భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసే వ్యాఖ్యలు, ఇచ్చే హామీలు నమ్మశక్యం కాదు కాబట్టి ఆయన మాటలను అంతా లైట్‌ తీసుకుంటూ ఉంటారు. కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిని తానేనని, జగన్‌ తన పార్టీలో చేరితే ప్రధానిని చేస్తానని, పవన్‌ కల్యాణ్‌ తన పార్టీలో చేరితే ఏపీ ముఖ్యమంత్రిని చేస్తానని కేఏ పాల్‌ తరచూ చెబుతూ ఉంటారనే విషయం తెలిసిందే.

అయినా కేఏ పాల్‌ తనపై వచ్చే మీమ్స్, సెటైర్లను పెద్దగా పట్టించుకోరు. యథాలాపంగా తాను చెప్పాలనుకున్నది చెప్పే తీరతారు. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు.. కేఏ పాల్‌.

కాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా లక్షల కోట్ల రూపాయలు తెచ్చి ఆపుతానని కేఏ పాల్‌ చెబుతూ వస్తున్నారు. అన్ని పార్టీలు తనతో కలిసి రావాలని కోరుతున్నారు. తనతోపాటు వైసీపీ, జనసేన, టీడీపీ ఇలా అన్ని పార్టీలు కలిసి వస్తే తాను ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్లి విశాఖ ప్రైవేటీకరణను ఆపుతానని చెబుతున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపడానికి తాజాగా ఆయన విశాఖలో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తన దీక్షను భగ్నం చేశారని.. ఒక సీఐ తనను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్‌ తాజాగా ప్రకటించారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని విశాఖ ఎంపీగా పోటీచేస్తానని వెల్లడించారు. ఈ మేరకు విశాఖ నగరంలోని పార్టీ కార్యకర్తలు, పాస్టర్లతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 24న విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ..మోదీకే మద్దతివ్వడంతో రాష్ట్రం అధోగతిపాలవుతుందని మండిపడ్డారు.

కాగా కేఏ పాల్‌ 2019లో నర్సాపురం లోక్‌ సభా స్థానం నుంచి బరిలోకి దిగి కేవలం 3 వేల ఓట్లు తెచ్చుకున్నారు. తెలంగాణలోని మునుగోడులోనూ ఓటమి పాలయ్యారు. ఈసారి విశాఖ నుంచి పోటీ చేస్తానంటున్నారు.

అయితే ఇటీవల కేఏ పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రియాశీలకంగా లేని 537 పార్టీలను ఎన్నికల సంఘం నుంచి జాబితా నుంచి తొలగించింది. ఆ పార్టీల గుర్తింపును, ఎన్నికల గుర్తులను సైతం రద్దు చేసింది. ఎన్నికల సంఘం తమ జాబితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీ కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో, లేక తన పార్టీనే పునరుద్ధరించుకుంటారో వేచిచూడాల్సిందే.