కేఏ పాల్ ఫస్ట్రేషన్ పీక్స్.. విశాఖలో సీఐ కాలర్ పట్టుకొని ఆగ్రహం
ఆయన్ను అడ్డుకోబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకొన్న కేఏ పాల్ తీరు షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 30 Aug 2023 4:31 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్ గా మారిన వేళ.. ఆ వేడిని తగ్గించే విషయంలో కేఏ పాల్ వ్యాఖ్యలు.. ఆయన చేష్టలు ఉంటాయన్న మాట రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆయన చెప్పే మాటలు ఆసక్తిగా వినేందుకు.. ఆయన వీడియోలు చేసేందుకు ఆసక్తిని వ్యక్తమవుతుంటుంది. అయితే.. ఆయన్ను సీరియస్ గా తీసుకునే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా విశాఖలో ఆయన వేసిన వీరంగం చూస్తే మాత్రం హద్దులు దాటినట్లుగా అనిపించక మానదు.
మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని తన ఇంటి ముందు గుంతలు తవ్వుతున్న ఉద్యోగుల మీద నోరు పారేసుకున్న కేఏ పాల్.. తాజాగా విశాఖలో నిర్వహించిన ఆందోళనను భగ్నం చేసిన పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు,
ఆయన్ను అడ్డుకోబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకొన్న కేఏ పాల్ తీరు షాకింగ్ గా మారింది. పోలీసులు తన చేతులు.. కాళ్లు విరగ్గొట్టారని.. దీక్ష 24 గంటలు గడవకముందే.. భగ్నం చేసినట్లుగా ఆరోపించారు.
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని.. తక్షణమే సీఐ రామారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన చావు కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నట్లు చెప్పిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని.. నష్టాలు వచ్చేట్లు చేస్తున్నారన్నారు. మిగిలిన రాజకీయ వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా.. పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న ఉదంతంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ రెండు రోజుల క్రితం అల్టిమేటం ఇవ్వటం.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. నిరవధిక దీక్ష చేపట్టటం తెలిసిందే. ఈ నిరసనను అడ్డుకునే సందర్భంలో పోలీసులపై విరుచుకుపడిన ఆయన తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.