Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఏమైనా మూర్ఖుడా?... క్లారిటీ ఇచ్చిన పాల్!

By:  Tupaki Desk   |   24 Feb 2024 2:55 PM GMT
చంద్రబాబు ఏమైనా మూర్ఖుడా?... క్లారిటీ ఇచ్చిన పాల్!
X

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన నేపథ్యంలో దాని తాలూకు ఎఫెక్టులు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే 118లో 94 టీడీపీ పోటీ అని ప్రకటిస్తూ.. 175లో 24 మాత్రమే జనసేనకు అని చెప్పడంతో జనసైనికులు, వీరమహిళలు పంటికింద కోపాన్ని దిగమింగుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారని తెలుస్తుంది. కారణం... ఆయన చెప్పిన జోస్యం నిజమవ్వడమే!!

అవును... టీడీపీతో పవన్ కల్యాణ్ జట్టు కట్టడాన్ని విపరీతంగా వ్యతిరేకిస్తున్నవారిలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఒకరు! టీడీపీతో జనసేన పొత్తు అంశాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదని చెప్పినా అతిశయోక్తి కాదు. అప్పుడే "తమ్ముడూ" అని సంబోధిస్తూనే నిప్పులు చెరుగుతుంటారు. తనతో కలిసి ప్రయాణించాలని ఎన్నోసార్లు కోరారు కూడా! అయితే కేఏ పాల్ రిక్వస్టులకు, విమర్శలకు పవన్ స్పందించిన దాఖలాలు లేవు!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా 175 స్థానాల్లోనూ పొత్తులో భాగంగా జనసేనానికి 24 సీట్లు కేటాయించడంపై కేఏ పాల్ స్పందించారు. ఈ విషయం తాను ఎన్నోసార్లు చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ పాతిక సీట్లకు అమ్ముడుపోతాడనే విషయం తాను ఎన్నోసార్లు చెప్పాను అని చెబుతున్న కేఏ పాల్... హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి వారు 50 - 60 సీట్లు ఇవ్వాలి, రెండున్నర సంవత్సరాలు సీఎం పోస్టు ఇవ్వాలి అని కోరారని తెలిపారు.

ఈ సందర్భంగా మరింత డోసు పెంచిన కేఏ పాల్... తన కుమారుడు లోకేష్ ఉండగా దత్తపుత్రుడు పవన్ కి 100 సీట్లిచ్చి సీఎం పోస్ట్ ఇవ్వడానికి చంద్రబాబు ఏమైనా మూర్ఖుడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన 94 స్థానాల్లోనూ కాపులకు, బీసీలకు పెద్ద పీట ఎక్కడ అని ప్రశ్నించారు.

వాస్తవానికి పవన్ కల్యాణ్ ఏ క్షణమైతే చంద్రబాబుతో జతకట్టారో ఆనాటి నుంచీ కాపుల్లోని ఒకవర్గం నుంచి బలమైన వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కాపుల విషయంలోనూ, బీసీలకు పెద్ద పీట వేసే విషయంలోనూ చంద్రబాబు చిత్తశుద్ధిని వారు నిత్యం ప్రశ్నిస్తూ.. గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా జనసేనకు 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో అటు చంద్రబాబుతో పాటు ఇటు పవన్ కల్యాణ్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు కాపు సమాజంలోని కీలక వ్యక్తులు!