Begin typing your search above and press return to search.

జగన్, కేసీఆర్, రేవంత్‌ లపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిపై కేఏ పాల్‌ ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్‌ గొప్ప నాయకుడు అని కొనియాడారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 9:11 AM GMT
జగన్, కేసీఆర్, రేవంత్‌ లపై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు!
X

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలంగాణ అసెంబ్లీలో సందడి చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్న వేళ ఆయన అసెంబ్లీకి వచ్చారు. అనుమతి లేకపోవడంతో ఆయనను అసెంబ్లీ సెక్యూరిటీ, అధికారులు లోపలికి వెళ్లనీయలేదు. ఆ తర్వాత కాసేపు వెయిట్‌ చేసిన తర్వాత అనుమతి ఇవ్వడంతో ఆయన తన కోడలితో కలిసి లోపలికి వెళ్లారు. అసెంబ్లీకి వెళ్లిన పాల్‌.. పలువురు అధికారులు, రాజకీయ నేతలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిపై కేఏ పాల్‌ ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్‌ గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చాక తెలంగాణ పరిస్థితి మారుతోందన్నారు. వచ్చే అక్టోబర్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం మారబోతోందని వెల్లడించారు.

రేవంత్‌ తో కలిసి ప్రపంచంలోని బిలియనీర్లను కలిసి తెలంగాణకు పెట్టుబడులు తెస్తానని తెలిపారు. రష్యా అధినేత పుతిన్‌ కు కూడా ఇంగ్లీష్‌ తెలియనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కేఏ పాల్‌ గుర్తు చేశారు. రేవంత్‌ ఇంగ్లీష్‌పై విమర్శలు చేయడం తెలివి తక్కువతనమని ధ్వజమెత్తారు.

మాజీ సీఎం కేసీఆర్‌ కు, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డికి అసలు పోలికే లేదని కేఏ పాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ డిక్టేటర్‌ లా వ్యవహరిస్తే.. రేవంత్‌ మాత్రం ప్రజల కోసమే పని చేస్తున్నారని అభినందించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ వేస్ట్‌ ఫెలో అని, రూ.పది లక్షల కోట్లు అప్పు చేశారని కేఏ పాల్‌ ఆరోపించారు. మరోవైపు.. రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో వైజాగ్‌ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు కేఏ పాల్‌ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి పోటీ చేశారు. అలాగే తెలంగాణ ఉప ఎన్నికల్లో మునుగోడు నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఈ రెండు చోట్లా కేఏ పాల్‌ కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్‌ ప్రకటించడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

మరోవైపు కేసీఆర్, జగన్‌ లపై కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్, వైసీపీ నేతలు ఆయనపై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీల నేతల మాటల దాడిని పాల్‌ ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే.