Begin typing your search above and press return to search.

సీరియస్ వాదనల వేళ సిబల్ నవ్వటమా? సుప్రీంలో షాకింగ్ సీన్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా సుపరిచితులైన కపిల్ సిబల్.. దేశంలోనే అతి పెద్ద లాయర్లలో ఒకరన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Aug 2024 4:28 AM GMT
సీరియస్ వాదనల వేళ సిబల్ నవ్వటమా? సుప్రీంలో షాకింగ్ సీన్
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా సుపరిచితులైన కపిల్ సిబల్.. దేశంలోనే అతి పెద్ద లాయర్లలో ఒకరన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఉదంతంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తరఫు సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈ సమయంలో కపిల్ సిబల్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీబీఐ తరఫు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చేలా వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కు.. సీబీఐ తరఫు వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య వాడీ వేడీ వాదనలు కోర్టు హాలును వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలు చేయటంలో చోటు చేసుకున్న లోటుపాట్లపై తుషార్ మెహతా పలు అంశాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సిబల్ హేళనగా నవ్వుతున్న వైనాన్ని ప్రస్తావించిన తుషార్ మెహతా.. ‘‘ఎఫ్ఐఆర్ దాఖలులో చోటు చేసుకున్న లోటుపాట్లను నేను వివరిస్తుంటే సిబల్ హేళనగా నవ్వుతున్నారు. ఒక అమాయకురాలు అత్యంత దారుణ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం’’ అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలతో కపిల్ సిబల్ కాస్త సర్దుకున్నారు.

ఇక.. కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఉదంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు.. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సైతం ఆక్షేఫించటం గమనార్హం. ‘‘సాయంత్రం 6.10 గంటల నుంచి 7.10 గంటల మధ్యలో పోస్టుమార్టం జరిపారు. అంటే.. అప్పటికే అసహజ మరణమని ఝూడీ అయినట్లే. కానీ.. అర్థరాత్రి కూడా కనీసం కేసు నమోదు చేయకపోవటం చాలా ఆశ్చర్యకరం. గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు’’ అంటూ పోలీసుల తీరుపై ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ పార్దీ వాలా సీరియస్ అయ్యారు.

ఈ సందర్భంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సైతం ఆక్షేపిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అర్థరాత్రి సోస్టుమార్టం తర్వాత కానీ క్రైం సీన్ ను పోలీసులు అధీనంలోకి తీసుకోలేదు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకు అంత ఆలస్యం చేయాల్సి వచ్చింది? ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్ కతా పోలీసులు అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశం. 14 గంటలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటమా?’’ అంటూ సీరియస్ గా ప్రశ్నించారు.

ఘోరం గురించి ఉదయమే తెలిసినా.. సాయంత్రానికి పోస్టుమార్టం చేసినా రాత్రి 11.30 గంటల వరకు పోలీసులకు సమాచారమే ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించిన సీజేఐ.. ‘‘ఇంత దారుణ అంశం గురించి తెలిసిన వెంటనే నేరుగా ఆసుపత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చూడటం ప్రిన్సిపల్ కనీస బాధ్యత. ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు? అసలు ఆయన ఎవరితో టచ్ లో ఉన్నారు? దానికి వెనుక ఉన్న కారణాలేంటి? విమర్శల తీవ్రతకు ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా ఆయన్ను సింఫుల్ గా మరో వైద్య కాలేజీనికి బదిలీ చేయటమా? దీనంతటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు హాజరై ఎంట్రీ నమోదు సమయం.. తదితర వివరాల్ని నేరుగా వెల్లడించాలి’’ అంటూ జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు.