Begin typing your search above and press return to search.

టీడీపీలో కాపులు హ్యాపీయేనా ?

కాపు నేతలకు టీడీపీలో ప్రాధాన్యాత ఉన్నా మిత్రపక్షంగా జనసేన ఉండడంతో ఆ పార్టీకి పొత్తు ధర్మంలో పదవులు వరసగా వెళ్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 9:30 AM GMT
టీడీపీలో కాపులు హ్యాపీయేనా ?
X

తెలుగుదేశం పార్టీలో కాపు నేతలు చాలా మంది ఉన్నారు. వారిలో ఎమ్మెల్యేలు అయిన వారు ఎక్కువగానే ఉన్నారు. ఇక సీనియర్ నేతల జాబితా కూడా పెద్దగానే కనిపిస్తోంది. మరి ఇంతమంది నేతలతో అలరారుతున్న టీడీపీలో కాపులు అంతా హ్యాపీయేనా అంటే అక్కడే కొత్త చర్చ మొదలవుతోంది.

కాపు నేతలకు టీడీపీలో ప్రాధాన్యాత ఉన్నా మిత్రపక్షంగా జనసేన ఉండడంతో ఆ పార్టీకి పొత్తు ధర్మంలో పదవులు వరసగా వెళ్తున్నాయని అంటున్నారు. ఆ విధంగా చూస్తే టీడీపీలో కాపులకు దక్కాల్సిన సామాజిక వర్గ కోటా జనసేన ద్వారా భర్తీ అవుతోంది అని అంటున్నారు.

అందువల్లనే చాలా మంది సీనియర్ నేతలకు మొదట ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదని, తీరా వాటిని అధిగమించి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకుని నెగ్గిన వారికి కూడా మంత్రి పదవులు లభించడం లెద్ని చర్చ అయితే ఉంది. ఉత్తరాంధ్రాలో గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు, గోదావరి జిల్లాలలో నిమ్మకాయల చినరాజప్ప వంటి వారికి ఈ కారణంగానే పదవులు దక్కలేదని అంటున్నారు.

చిత్రమేంటి అంటే వీరంతా 2014 నుంచి 2019 మధ్య కీలకమైన మంత్రి పదవులను అనుభవించారు. ఆనాడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాంతో కాపు కోటా టీడీపీలో పదిలంగా ఉంది. అది కచ్చితంగా దక్కించుకున్న బిగ్ షాట్స్ కి అధికారం చాలా సులువుగా అందింది అంటున్నారు.

ఇక టీడీపీ అధినాయకత్వం ఆలోచనలు చూస్తే కనుక బీసీలు ఎటూ టీడీపీ వైపే దశాబ్దాల కాలంగా ఉన్నారని సొంత సామాజికవర్గంతో పాటు అగ్ర వర్ణాలు కూడా పార్టీకి ఓటు బ్యాంక్ అని భావిస్తోంది. ఇక మైనారిటీలలో దళితులలో వచ్చిన మార్పుతో 2024 ఎన్నికలో టీడీపీ బంపర్ విక్టరీ సాధించింది.

మిత్రపక్షం అయిన జనసేన ద్వారా కాపులు కూడా తమ వైపే ఉన్నారు అన్న ధీమా కూడా ఉంది అని అంటున్నారు. అందుకే ఆ బలమైన కాపు సామాజిక వర్గం మద్దతుని మరింత పదిలం చేసుకునేందుకు జనసేనకు పదవుల విషయంలో ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటోంది అని అంటున్నారు.

ఈ విధంగా టీడీపీ ఆలోచించడం పార్టీ వరకూ బాగానే ఉన్నా టీడీపీలో కాపులకు మాత్రం పదవులు అందని పండు అవుతున్నాయని అంటున్నారు. అదే సమయంలో జనసేనలో ఉన్న కాపులకు మాత్రం బాగానే అవకాశాలు దక్కుతున్నాయని అంటున్నారు. ఏపీలో మంత్రి మండలిలో జనసేనకు నాగబాబుతో ఇచ్చే పదవితో కలుపుకుని నాలుగు కేబినెట్ బెర్తులు దక్కాయి. అందులో మూడు కాపులకే కేటాయించారు. ఇక జనసేనకు ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో కూడా ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఏకైక ఎమ్మెల్సీ కూడా వారికే దక్కింది.

ఇలా లెక్కలేసుకుంటే జనసేనలోనే కాపులకు రాజకీయ ఉన్నతి అయితే కనిపిస్తోంది అన్న భావన ఉంది. ఇది మరింతగా బలపడితే మాత్రం వైసీపీ టీడీపీ అన్న తేడా లేకుండా అంతా జనసేన వైపు క్యూ కడతారు అని అంటున్నారు. ఇక టీడీపీ ఈ రోజున పొత్తు ధర్మం పేరుతో జనసేనకు పదవులు ఇస్తూ పోతోంది. సొంత పార్టీలో కాపులు అయితే దీని మీద అంతర్మధనం చెందుతున్నారు.

ఇది ఇలాగే సాగితే జనసేన ఒక బలమైన సామాజిక వర్గానికి అండగా ఉంటూ కొండలా ఐదిగితే మాత్రం భవిష్యత్త్తులో టీడీపీకి కూడా అది ఇబ్బందే అని అంటున్నారు. అదే సమయంలో సాధారణంగా తమకు పదవులు దక్కే చోటనే ఎవరైనా రాజకీయం చేస్తారు. అలా టీడీపీలో ఉన్న బలమైన సామాజిక వర్గం కూడా జనసేన వైపు చూస్తే కనుక పసుపు పార్టీ వేసుకుంటున్న వ్యూహాలు కూడా బెడిసి కొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో కాపులు ఓసీలుగా బీసీలుగా అత్యధిక సంఖ్యలో ఉన్నారని వారికి టీడీపీ గతంలో పదవులు ఇచ్చేదని ఇపుడు ఆ ముచ్చట అయితే కనిపించడం లేదని అంటున్నారు. అసలు టోటల్ కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రా నుంచి కాపు మంత్రులు ఒక్కరే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలీ అంటే మిత్రులను గౌరవిస్తూనే టీడీపీ సొంత పార్టీ నేతలను కూడా కాపు కాసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.