'కాపు' కాచేదెవరు... ఉత్తుత్తి ఆర్భాటమే?
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి... తాజాగా సీఎం జగన్‌పైనా.. వైసీపీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By: Tupaki Desk | 6 Jan 2024 2:30 PM GMTరాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి... తాజాగా సీఎం జగన్‌పైనా.. వైసీపీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అంటే దేవుడితో సమానం అంటూనే ఆయనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో టికెట్ నిరాకరించడమే కాపు వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వాస్తవం ఏంటంటే.. క్షేత్రస్థాయిలో కాపు వారి పరిస్థితి ఏంటనేది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అనేక విషయాల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మైనింగ్ సహా.. ఇతర వ్యాపారాల్లో ఉన్న కాపు.. నియోజకవర్గానికి కడు దూరంలో ఉంటున్నారు. నియోజక వర్గం ప్రజలకు ఆయన ఇటీవల మాత్రమే కనిపిస్తున్నారు. వాస్తవానికి నియోజకవర్గంలో కాపు వారి సతీమణి చక్రం తిప్పుతున్నారనేది నిర్వివాదాంశం. ఏ పనికావాలన్నా.. ఏం చేయాలన్నా.. కనీసం వలంటీర్ల నియామకం చేయాలన్నా.. కాపు వారి సతీమణి చూడాల్సిందే. ఆమె ఆమోదం లభించాల్సిందే. ఈ విషయంలో గతంలోనే సీఎం జగన్ హెచ్చరించారు.
ఎమ్మెల్యే ఒకరు షాడో ఎమ్మెల్యే మరొకరు.. అని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన ముందు పెట్టి మరీ ప్రశ్నించారు. ఆ సమయంలోనే కాపునుజాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దీనికి తోడు.. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మందలించారు. కానీ, ఇవన్నీ.. స్వామి భక్తిలో కొట్టుకుపోతాయని లెక్కలు వేసుకున్నారు. కానీ, అటు వైపు ప్రత్యర్తి పక్షాన్ని చూసుకుంటే.. రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు బలంగా ఉన్నారు.
ఆయనను ఢీ కొట్టి, నిలిచి గెలిచే సత్తా కాపుకు లేకుండా పోయింది. ఇదే విషయం సర్వేల్లోనూ స్పష్టంగా తేలిపోయింది. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి.. తాను సీఎం జగన్‌ను ఎంతో ఆరాధించానని.. అయినా.. తనను పరిగణనలోకి తీసుకోలేదని వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. కాపు బయటకు వచ్చారు. ఇదిలావుంటే.. ఆయనను చేర్చుకునేందుకు ఏ పార్టీ కూడా రెడీగా లేదనేది తెలిసిందే. ఇక, పోటీ చేయాలంటే.. స్వతంత్రంగానే చేయాలి. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.