Begin typing your search above and press return to search.

జగన్‌ కు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. అందుకే దారుణ ఓటమి!

ఐదేళ్లలో పాలన, వ్యవస్థలో తప్పిదాలను సరిదిద్దడంలో విఫలమైనందుకే ఈ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ధర్మశ్రీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 7:08 AM GMT
జగన్‌ కు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. అందుకే దారుణ ఓటమి!
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే కుదేలయింది. ఇప్పటివరకు సైలెంట్‌ గా ఉన్న ఓడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ ఓటమిపై పోస్టుమార్టం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ కోవలో అనకాపల్లి జిల్లా చోడవరం మాజీ ఎమ్మెల్యే, ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ చేరారు. తన నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తాను ఎన్నోసార్లు జగన్‌ కు విన్నవించానని, ఆయన పట్టించుకోలేదని బాంబుపేల్చారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన కరణం ధర్మశ్రీ తన ఓటమికి పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నే తప్పుబట్టారు. ఐదేళ్లలో పాలన, వ్యవస్థలో తప్పిదాలను సరిదిద్దడంలో విఫలమైనందుకే ఈ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని ధర్మశ్రీ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయని ధర్మశ్రీ అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు తమను తిరస్కరించారన్నారు. వ్యవస్థాగత, పరిపాలనాపరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారితీశాయని కుండబద్దలు కొట్టారు.

చోడవరం నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తాను పదే పదే చేసిన అభ్యర్థనలను జగన్‌ పట్టించుకోవడం వల్లే తాను ఓటమి పాలు కావాల్సి వచ్చిందని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. బిఎన్‌ హైవేపై ఉన్న గుంతలను చాలా నెలలుగా చూసీచూడనట్లు వదిలేశారని, అందుకే భారీ మెజార్టీతో ఓడిపోక తప్పలేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ప్రభుత్వం తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని కరణం ధర్మశ్రీ తెలిపారు. దీంతో రోడ్ల మరమ్మతులకు తన సొంత డబ్బు రూ.2 కోట్లు వెచ్చించానని తెలిపారు. తాను ఖర్చు పెట్టిన డబ్బుకు సంబంధించి కొత్త ప్రభుత్వం బిల్లులు ఇస్తుందో, లేదో తెలియదన్నారు.

తెలిసో.. తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు తమను అధికారానికి దూరం చేశారన్నారు. ఈ విషయాన్ని తామంతా అంగీకరిస్తున్నామని తెలిపారు. అవే తప్పులు చేస్తూ మీరూ (కూటమి నేతలు) ఓటమిని కోరుకుంటారా అని ప్రశ్నించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కలిసి వైసీపీ సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ çసభ్యులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి కోరారు.