సైఫ్ పై కత్తితో దాడి కేసు... కరీనా కపూర్ స్టేట్ మెంట్ ఇదే!
తాజాగా నటుడు సైఫ్ ఆలీఖాన్ సతీమణి, బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డ్ చేశారు.
By: Tupaki Desk | 18 Jan 2025 8:22 AM GMTబాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు ఆరుసార్లు కత్తితో పొడిచి దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం సైఫ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయం లేదని అన్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా... తాజాగా నటుడు సైఫ్ ఆలీఖాన్ సతీమణి, బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆరుసార్లు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
అవును... సైఫ్ పై కత్తితో దాడి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కరీనా... దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని.. ఈ సమయంలో సైఫ్ పై ఆరుసార్లు కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
ఆ సమయంలో పిల్లలు తైమూర్, జహంగీర్ లను రక్షించడానికే సైఫ్ ప్రయత్నించాడని.. ఈ నేపథ్యంలోనే దుండగుడు పిల్లలను చేరుకోలే సైఫ్ పై దాడికి పాల్పడ్డాడని.. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడని తెలిపారు. ఇంట్లోని నగలు, నగదు ఏమీ దొంగిలించలేదని బాంద్రా పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కరీనా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో... సంఘటన జరిగిన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన కరీనా కపూర్.. తన సోదరి కరిష్మా ఇంటికి వెళ్లగా.. సైఫ్ ఆలీఖాన్ ఆస్పత్రికి ఆపరేషన్ చేయించుకున్నారు. దీనిపై స్పందించిన కరీనా... తాను చాలా భయపడటంతో కరిష్మా తన ఇంటికి తీసుకెళ్లిందని తెలిపారు.
నిందితుడు ముంబై వీధుల్లోనే తిరుగుతున్నాడా?
మరోవైపు సైఫ్ పై దాడిచేసినట్లు అనుమనిస్తున్న వ్యక్తి ముంబై వీధుల్లోనే పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. దాడి జరిగిన రోజు.. నిందితుడి ఫోటోలను పోలీసులు తొలుత మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లు కనిపించాడు.
ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో విడుదల చేసిన సీసీ ఫుటేజీల్లో బ్లూ షర్ట్ లో కనిపించగా.. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో అతడు పసుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు కనిపించాడు. దీంతో... ఇవి బాంధ్రా రైల్వే స్టేషన్ లోని ఫుటేజ్ లోని దృశ్యాలు అని అంటున్నారు. దీంతో... నిందితుడు ముంబై వీధుల్లోనే ఉన్నాడనే చర్చ మొదలైంది.
మరోవైపు.. అతడు స్టేషన్ లో రైలెక్కి నగరంలోని మరో చోటుకి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఓ మొబైల్ షాపులో హెడ్ ఫోన్స్ కొంటున్నట్లు కనిపించిన నిందితుడి వీడియో అని చెబుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.