ఆమె కళ్లే స్పెషల్.. ప్రపంచంలోని 10 మందిలో మనమ్మాయి ఒక్కతే!
ఆమె కళ్ల గురించి.. దాని ప్రత్యేకత గురించి.. అవెంత అరుదైనవన్న విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
By: Tupaki Desk | 14 July 2024 12:30 PM GMTఆమె కళ్ల గురించి.. దాని ప్రత్యేకత గురించి.. అవెంత అరుదైనవన్న విషయం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె లాంటి ప్రత్యేక కళ్లు ప్రపంచంలో కేవలం పది మందికి మాత్రమే ఉండటం ఒక విశేషం అయితే.. అందులో ఒకరు భారతీయురాలిగా గుర్తింపు పొందారు మోడల్ కం నటి కరిష్మా. 34 ఏళ్ల వయసున్న కరిష్మా మోడల్ గా.. నటిగా రాణిస్తున్నారు. అయితే.. ఆమె కళ్లు సో స్పెషల్. అలాంటి అరుదైన కళ్లు ప్రపంచంలో పది మందికి మాత్రమే ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇంతకూ ఆమె కళ్లకు ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ‘కంజెనిటల్ హెటెరోక్రోమియా ఇరీడియమ్’. ఇదో అరుదైన కంటి వ్యాధి కావటం గమనార్హం. ఈ వ్యాధి సోకిన వారు ప్రపంచంలో పది మంది మాత్రమే ఉన్నారు. మన దేశంలో కరిష్మా ఒక్కరే. ఆమె గుజరాత్ లోని కచ్ జిల్లా ఆదిపుర్ కు చెందిన వారు. ఈ అరుదైన వ్యాధితో ఆమె కళ్లు ఇప్పుడు కొత్త ప్రచారంగా మారాయి. అరుదైన కళ్లు కలిగిన అమ్మాయిగా 2020లో తొలిసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించినట్లు చెబుతున్నారు.
2010లో ఇంగ్లిష్ సాహిత్యంలో గోల్డ్ మెడల్ అందుకున్న ఆమె మోడల్ గా.. యాక్టర్ గా కూడా రాణించారు. పలు వాణిజ్య ప్రకటనలు.. టీవీ సీరియళ్లలో నటించారు. వర్డ్స్ కం ఫ్రమ్ సోల్ అనే కవితా సంకలనంలో ఆమె అరుదైన కళ్ల మీద.. వాటి అందం మీదా కవితలు రాయటం గమనార్హం. దాదాపు మూడు వేలకు పైగా పురస్కారాలు ఆమెసొంతం చేసుకున్నారు. ఇంతకూ ఈ అరుదైన వ్యాధి బారిన పడిన వారి కళ్లలో ఉండే ప్రత్యేకత ఏమంటే.. వారి కళ్ల రంగు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అరుదైన వ్యాధి ఏమో కానీ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు.