తెలుగు రాష్ట్రాల్ని ప్రస్తావిస్తూ కర్ణాటక అసెంబ్లీలో అధికార పక్షానికి పంచ్ లు
ఈ తీరును బీజేపీ సభ్యుడు క్రిష్ణప్ప తప్పు పట్టారు. ఆయనకు మద్దతుగా మరో విపక్ష నేత అశోక్ కలుగజేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 12 March 2025 2:00 PM ISTకర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలతో పాటు.. ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన వాలంటీర్ల అంశం మీదా హాట్ చర్చ సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్ని ఉదాహరణలుగా పేర్కొంటూ అధికారపక్షానికి పంచ్ లు వేశాయి కర్ణాటక విపక్షాలు. ఇంతకూ జరిగిందేమంటే.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్ని అమలు కోసం పార్టీ నేతలు పలువురిని సమితులకు అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారికి క్యాబినెట్ హోదా కట్టబెట్టారు.
ఈ తీరును బీజేపీ సభ్యుడు క్రిష్ణప్ప తప్పు పట్టారు. ఆయనకు మద్దతుగా మరో విపక్ష నేత అశోక్ కలుగజేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి.. తాను సీఎం అయ్యాక కానీ గ్యారెంటీలను అమలు చేయటం ఎంత కష్టమన్న విషయాన్ని గుర్తించారని.. ఇదే విషయాన్ని ఆయన ఒకసారి అన్నట్లుగా పేర్కొన్నారు. వీరి వాదనకు తోడుగా మరో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీలోని గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని ప్రస్తావించారు.
లక్షల జీతాలు తీసుకునే అధికారులు.. ఎమ్మెల్యేలను కాదని కొందరు నేతలకు క్యాబినెట్ హోదా ఇచ్చి.. వారికి ఏటా రూ.10 కోట్లు ఖర్చు చేయటాన్ని తప్పు పట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభఉత్వం సంక్షేమ పథకాల్ని అమలు చేసే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పజెప్పి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని పేర్కొన్నారు.
ఎన్నికల వేళ తాము ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు వీలుగా చేపట్టిన కార్యక్రమాన్ని విపక్షాలు తప్పు పడుతూ.. చేస్తున్న వ్యాఖ్యలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన కార్యకర్తలకు మంచి చేయటం తమ బాధ్యతగా పేర్కొంటూ తాము అనుసరిస్తున్న విధానాల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చర్చ అందరిని ఆకర్షించింది.