Begin typing your search above and press return to search.

రూ. 6 కోట్ల కోసం కిడ్నాప్.. రూ. 300 తిరిగి ఇచ్చి ఇంటికి పంపిన కిడ్నాపర్లు

ఉదయం వాకింగుకు వెళ్లిన డాక్టరును అపహరించిన కిడ్నాపర్లు.. సాయంత్రం వరకు ఆయనను రకరకాల ప్రదేశాల్లో తిప్పి సాయంత్రం విడిచి పెట్టారు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 2:30 AM GMT
రూ. 6 కోట్ల కోసం కిడ్నాప్.. రూ. 300 తిరిగి ఇచ్చి ఇంటికి పంపిన కిడ్నాపర్లు
X

కర్ణాటకలోని బళ్లారిలో చిన్నపిల్లల వైద్యుడిని కిడ్నాప్ సంచలనం రేపింది. ఉదయం వాకింగుకు వెళ్లిన డాక్టరును అపహరించిన కిడ్నాపర్లు.. సాయంత్రం వరకు ఆయనను రకరకాల ప్రదేశాల్లో తిప్పి సాయంత్రం విడిచి పెట్టారు. అయితే ఉదయం కిడ్నాప్ చేయగానే రూ.6 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసిన కిడ్నాపర్లు.. సాయంత్రం డాక్టరును ఓ మారుమూల ప్రదేశంలో విడిచిపెట్టారు. ఆ సమయంలో బాధితుడు క్షేమంగా ఇంటికి వెళ్లేందుకు రూ.300 నగదు కిడ్నాపర్లే ఇవ్వడం గమనార్హం. ఆసక్తికరంగా ఉన్న ఈ క్రైం స్టోరీ కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బళ్లారి జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న సునీల్ చిన్న పిల్లల వైద్య నిపుణుడు. రోజూ ఆస్పత్రికి వెళ్లడం.. సాయంత్రం ఇంటికి రావడమే ఆయన దైనందన జీవితం. పెద్దగా ఎవరూ శత్రువులు లేని డాక్టర్ సునీల్ ఒక్కరే తిరుగుతుంటారు. అదేవిధంగా సోమవారం ఉదయం 6 గంటలకు తన ఇంటికి సమీపంలోని ఓ దేవాలయం వద్ద వాకింగ్ చేస్తుండగా, టాటా ఇండిగో కారులో వచ్చిన దుండగులు డాక్టరును బెదిరించి కారులో అపహరించారు.

ఆ తర్వాత డాక్టర్ సునీల్ సోదరుడు వేణుగోపాల్ గుప్తాకు వాట్సాప్ కాల్ చేసి డాక్టర్ సునీల్ ను విడిచి పెట్టాలంటే రూ. 6 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన వేణుగోపాల్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆలయం సమీపంలో డాక్టర్ సునీల్ ను బలవంతంగా కారు ఎక్కించడం ఓ కెమెరాలో రికార్డైంది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, తమ కోసం పోలీసులు గాలిస్తుండటంతో దుండగులు సాయంత్రం ఎలాంటి డిమాండ్లు లేకుండానే డాక్టర్ సునీల్ ను క్షేమంగా విడిచిపెట్టారు.

ఓ నిర్మానుష్య ప్రాంతానికి డాక్టర్ ను తీసుకువెళ్లి ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచిపెట్టడమే కాకుండా.. డాక్టర్ ఆ ప్రాంతం నుంచి బళ్లారి వెళ్లేందుకు రూ.300 ఇచ్చారు. ఆ డబ్బుతో ఇంటికి క్షేమంగా చేరుకున్న డాక్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, డాక్టర్ సోదరుడు వేణుగోపాల్ గుప్తా జిల్లా మద్యం వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆయనను బెదిరించేందుకు వ్యాపరపరమైన వివాదాలు ఉన్నవారే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.