Begin typing your search above and press return to search.

ఏపీ వ్యక్తి కర్ణాటకలో చేసిన డాంకీ స్కామ్ గురించి తెలుసా?

గత కొన్ని రోజులుగా గాడిద పాల వ్యాపారం, ఆ పాల విశిష్టత గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2024 5:51 AM GMT
ఏపీ వ్యక్తి కర్ణాటకలో చేసిన డాంకీ స్కామ్  గురించి తెలుసా?
X

గత కొన్ని రోజులుగా గాడిద పాల వ్యాపారం, ఆ పాల విశిష్టత గురించి రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్ లో ఓ వ్యక్తి గాడిద పాలతో నెలకు రూ.3 లక్షల వరకూ సంపాదిస్తున్నాడంటూ ఇటీవల కథనాలు హల్ చల్ చేశాయి. పైగా... ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిదపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే ప్రచారం జరుగుతుంది.

ప్రధానంగా గాడిద పాలలో ఔషధ గుణాలు ఉండటమే కాకుండా.. ఇవి తల్లిపాలను పోలి ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవు పాలు అంటే ఎలర్జీ ఉండే శిశువులకు గాడిద పాలు సరైన ప్రత్యామ్నాయమని.. ఇది పేగుల్లోని మంచి బాక్టీరియా వృద్ధికి దోహదపడుతుందని అధ్యయానాలు చెబుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో గాడిద పాల సేకరణ పేరుతో ఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

అవును... గత కొన్ని రోజులుగా గాడిద పాలకు సంబంధించిన కథనాలు హల్ చేస్తున్న వేళ పలువురు రైతులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో... గాడిదల పాల సేకరణ పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని హోసపేటెలో సుమారు 300 మంది రైతులను వ్యాపారులు మోసం చేశారు. ఈ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం...!

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి "జెన్ని మిల్క్" అనే సంస్థను మూడు నెలల కిందట హోసపేటె పట్టణంలోని హంపీ మార్గంలో కాస్త గట్టిగానే ప్రారంభించారు. ఈ మేరకు సిబ్బందినీ నియమించుకున్నారు. ఈ క్రమంలో ఓ సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... రూ.3 లక్షలు ఇస్తే మూడు గాడిదలను ఇస్తామని ప్రకటించారు.

వాటిని పోషించి పాలు పితికి ఇస్తే లీటరుకు రూ.2,350 చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో... చాలా మంది రైతులు ఈ ప్రచారానికి ఆకర్షిస్తులయ్యారు. వీరిలో జిల్లాలోని సుమారు 200 మంది రైతులు రూ.3 లక్షల చొప్పున చెల్లించారు. దీంతో... చెప్పినట్లుగానే వారికి రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన గాడిదలను నిర్వాహకులు ఇచ్చారు.

దీంతో... మరో 100 మంది రైతులు ఈ వ్యవహారానికి ఆకర్షితులై వారి కూడా రూ.3 లక్షలు కట్టి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సమయంలో ఓ రైతుకు ఈ వ్యవహారంపై కాస్త అనుమానం వచ్చి.. జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో.. విజయనగర జిల్లా ప్లానింగ్ డైరెక్టర్ నేతృత్వంలోని అధికారులు ఈ వ్యవహారం విచారణ మొదలుపెట్టారు.

ఈ విచారణలో.. ఈ వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. ఇలా ఈ గాడిద పాల వ్యాపారానికి, ఇతర అనుమతులు లేవని తేలడంతో.. కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు అధికారులు ఈ విషయాన్ని వెళ్లడించారు. దీంతో... 300 మంది సామాన్య రైతుల నుంచి రూ.9 కోట్లు దండుకున్నవారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది!