హనీ ట్రాప్ లో 48 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయాల్లో ‘హనీ ట్రాప్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 21 March 2025 5:52 AMకర్ణాటక రాజకీయాల్లో ‘హనీ ట్రాప్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రులు సహా ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని కొందరు వలపు వల పన్నినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారంటూ రాష్ట్ర మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యులు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం విచారణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
- 48 మంది అసభ్య వీడియోలు ఉన్నాయన్న మంత్రి రాజన్న
కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనకు తెలిసిన సమాచారం ప్రకారం.. కనీసం 48 మంది ఈ ఉచ్చులో చిక్కుకున్నారని ఆయన తెలిపారు. వారి అసభ్యకరమైన వీడియోలు సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదని, అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా బాధితుల్లో ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనుక ఎవరున్నారో తేలాలని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న అన్నారు.
- ఇది కొత్తేమీ కాదు: మంత్రి సతీశ్ జార్కిహోళీ
ఈ అంశంపై స్పందించిన మంత్రి సతీశ్ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిని రెండుసార్లు హనీ ట్రాప్ చేసే ప్రయత్నం జరిగిందని ధృవీకరించారు. అయితే ఇది రాష్ట్రానికి కొత్తేమీ కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. హనీ ట్రాప్‌నకు గురైన మంత్రి ఫిర్యాదు చేయాలని సూచించామని, ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
- దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు తెలుస్తాయి: డిప్యూటీ సీఎం
మరోవైపు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారా లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి కర్ణాటక రాజకీయాల్లో ఈ హనీ ట్రాప్ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.