డ్రైవర్లకు పోలీస్ షాక్... ఇలా చెబితేనే కానీ అర్ధమవ్వదా?
బిగ్గరగా హారన్ పెట్టుకుని సహ వాహనదారులను, పాదచారులను విసిగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నవారికి పోలీసులు వినూత్నమైన పనిష్మెంట్ ఇచ్చారు.
By: Tupaki Desk | 22 Jan 2025 9:44 AM GMTసాధారణంగా రోడ్లపై వాహనం మీద వెళ్తున్నా, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా చాలా వాహనాలు సాధారణ సౌండ్ తోనే హారిన్ మోగిస్తాయి కానీ.. మధ్యలో కొన్ని వాహనాలా హారిన్ మాత్రం ఒక్కసారిగా గుండె ఆగినంతగా, కర్ణభేరికి చిల్లు పడిందా అన్నంతగా, ఒల్లు జలదరించే స్థాయిలో మోగుతుంది. ఇలాంటి వారిని ఆపి తన్నాలనిపిస్తుందని అంటుంటారు!
ఇలా ఒక్కసారిగా చెవిలో గట్టిగా హారిన్ సౌండ్ మోగేసరికి చికాకు తో పాటు ఆందోళన కూడా వస్తుంది. అది కూడా వాహనం పక్కకు వచ్చి వేయడంతో దాని డెసిమల్స్ దెబ్బకు శరీరం ఒక్కసారిగా అదురుతుంది. ఈ సమయంలో అలాంటి డ్రైవర్లకు ఓ ఆసక్తికర పరిష్కారం కనుగొన్నారు కర్నాటక పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... బిగ్గరగా హారన్ పెట్టుకుని సహ వాహనదారులను, పాదచారులను విసిగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నవారికి పోలీసులు వినూత్నమైన పనిష్మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా తాజాగా ఇలాంటి హారన్ ఉన్న వాహన డ్రైవర్ ను కిందకు దించి.. అదే బస్సు ముందు కూర్చోబెట్టి, హారిన్ వినిపించారు కర్ణాటక ట్రాఫిక్ పోలీసు.
దీంతో... రోజూ బస్సులో కూర్చుని మోగిస్తున్న హారిన్ ను తానే వినేసరికి ఒక్కసారిగా అల్లల్లాడిపోయాడు. గట్టిగా చెవులు మూసుకున్నాడు. తనను వదిలేయాలని సాగిలపడ్డాడు. ఈ సమయంలో క్లాస్ తీసుకున్న ట్రాఫిక్ పోలీస్... నువ్వు హారన్ మోగిస్తుంటే రోడ్డుపై వెళ్లే మిగిలిన వాహదారులు, పాదచారులు ఇంతే ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు.
దీంతో... ఇంత భారీ భారీ సౌండ్స్ తో హారన్ మోగించడం కరెక్ట్ కాదని, తప్పేనని డ్రైవర్ కు అర్ధమయ్యేలా వివరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సదరు పోలీసులను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.