Begin typing your search above and press return to search.

రోజుకి 12 గంటలు పని!... కర్ణాటక ప్రభుత్వం మరో నిర్ణయం!?

అయితే... పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేసిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 12:42 PM GMT
రోజుకి 12 గంటలు పని!... కర్ణాటక ప్రభుత్వం మరో నిర్ణయం!?
X

ఇటీవల ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం తెలిపిన అనంతరం... ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగాల్లోనూ మెజారిటీ కన్నడిగులకే దక్కాలంటూ డాక్టర్ సరోజినీ మహిషీ గతంలో సమర్పించిన నివేదికను అమలుచేయాలని మంత్రివర్గ సమావేశంలో పలువురు ప్రస్థావించారు.

దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే... పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనపై ఆలోచన చేస్తోందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అవును... కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పని గంటలు పెంచే ప్రతిపాదనపై కర్ణాటక ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలుస్తుంది. దీనికోసం కర్ణాటక రాష్ట్ర షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ - 1961లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

ప్రస్తుతం ఓవర్ టైం తో కలిసి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పని చేసేందుకు అనుమతి ఉండగా... ఈ ప్రతిపాదనల ప్రకరం చూస్తే ఐటీ / ఐటీఈఎస్ / బీపీవో రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. ఇదే సమయంలో రోజులో గరిష్టంగా 14 గంటలు చొప్పున పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది.

అయితే... ఈ కీలక ప్రతిపాదనపై ట్రేడ్ యూనియన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు కర్ణాటక స్టేట్ ఐటీ లేదా ఐటీ ఆధారిత సేవలు అందించే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు.. ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రిని కలిసి తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఇందులో భాగంగా... పని గంటల పెంపు వల్ల ఉద్యోగులు మరింత శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయాలపై సందించిన కార్మిక శాఖా మంత్రి... పని గంటలు పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని.. దీనిపై చర్చలు ఇంకా నడుస్తూనే ఉన్నాయని.. ప్రస్తుతానికి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారని తెలుస్తోంది!