Begin typing your search above and press return to search.

"రోజుకు 14 గంటల పని"... కంపెనీలే కోరుకుంటున్నాయా..?

గత కొన్ని రోజులుగా "ఉద్యోగులు - ప్రైవేటు కంపెనీలు.. మధ్యలో కర్ణాటక సర్కార్" అనే టాపిక్ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 July 2024 6:00 PM GMT
రోజుకు 14 గంటల పని... కంపెనీలే కోరుకుంటున్నాయా..?
X

గత కొన్ని రోజులుగా "ఉద్యోగులు - ప్రైవేటు కంపెనీలు.. మధ్యలో కర్ణాటక సర్కార్" అనే టాపిక్ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్ అనే టాపిక్ తెరపైకి తెచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. తర్వాత నాలుక కరుచుకుందని అంటున్నారు! ఇదే సమయంలో.. మరో అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కథనాలొస్తున్న వేళ కర్ణాటక మంత్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

అవును... కర్ణాటకలోని ప్రైవేటు కంపెనీల్లోనూ రిజర్వేషన్లు అనే టాపిక్ తెరపైకి వచ్చిన తర్వాత అది కాస్త బూమరాంగ్ అయ్యిందనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అది పక్కనపెట్టిన ప్రభుత్వం... ప్రైవేటు ఉద్యోగుల పని గంటలపై ప్రతిపాదనలు చర్చిస్తున్నట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో స్పందించిన మంత్రి... ఈ ప్రతిపాదన ఐటీ పరిశ్రమలదే అంటూ బాంబు పేల్చారు!

ఇందులో భాగంగా... ప్రైవేట్ కంపెనీల్లోని పని వేళలను పెంచాలని నిర్ణయించింది ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కాదని.. పని గంటలు పెంచాలంటూ స్వయంగా ఐటీ పరిశ్రమలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని.. అందువల్లే ఈ బిల్లు తీర్మానానికి వచ్చిందని.. ప్రస్తుతానికైతే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ వెల్లడించారు.

అయితే ఈ వ్యవహారంపై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుండగా.. ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలే బహిరంగ చర్చ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. ఇదే సమయంలో ప్రజలు కూడా తమ తమ అభిప్రాయాలను పంచుకున్నప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు.

కాగా.. ప్రస్తూతం ఓటీతో కలిపి మాగ్జిమం 10 గంటలు మాత్రమే పనిచేయించుకునేందుకే అనుమతి ఉండగా... ఐటీ / ఐటీఈఎస్ / బీపీవో రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు వీలుగా కొత్త బిల్లు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... రోజులో గరిష్టంగా 14 గంటలు పనిచేయడానికి కూడా వీలు కలిపించేలా ఇది ప్రతిపాదిస్తుంది.