అన్నపై అక్కసు.. 'కొడుకు' రూపంలో తమ్ముడు 'కసి'
ఇలా.. కుమార స్వామి.. రేవణ్ణల మధ్య ప్రచ్ఛన్న రాజకీయ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే.. రేవణ్ణ కుమారుడు, హాసన్ పార్లమెంటు స్థానం ఎంపీ.. ప్రజ్వల్ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు.
By: Tupaki Desk | 21 May 2024 10:15 AM GMTరాజకీయాల్లో సొంత కుటుంబాలు కూడా.. బద్ధ శత్రువులుగా ఉన్న పరిస్థితి దక్షిణాది రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో సీఎం జగన్ను వ్యతిరేకించిన ఆయన సోదరి షర్మిల కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇక, తమిళనాడులో డీఎంకే పార్టీని సొంతం చేసుకునే ప్రయత్నం చేసి.. విఫలమైన కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి.. ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సొంత పార్టీ పెట్టుకుని.. తమ్ముడు, ప్రస్తుత సీఎం స్టాలిన్‌పై ఒకప్పుడు యుద్ధం ప్రకటించి విఫలమయ్యారు.
ఇదే తరహాలో కర్ణాకటలోనూ.. మాజీ ప్రధాని దేవెగౌడ ఇద్దరు కుమారుడు.. మాజీ సీఎం కుమారస్వామి.. ఆయన అన్న రేవణ్ణల మధ్య రాజకీయ రగడ రెండు దశాబ్దాలుగా ఉంది. పార్టీని కైవసం చేసుకునే విషయంలో 2005లో చెలరేగిన యుద్ధం.. ఇప్పటికీ అంతర్గతంగా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లోనే కాదు.. అంతకు ముందు ఎన్నికల్లోనూ.. తమ కుటుంబానికి టికెట్‌లు ఇప్పించుకునేందుకు రేవణ్ణ.. తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడను మధ్యవర్తిత్వం చేసిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
ఇలా.. కుమార స్వామి.. రేవణ్ణల మధ్య ప్రచ్ఛన్న రాజకీయ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే.. రేవణ్ణ కుమారుడు, హాసన్ పార్లమెంటు స్థానం ఎంపీ.. ప్రజ్వల్ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. ఏకంగా 3 వేల మందికి పైగా మహిళలతోను, 10 మందికి పైగా.. ఇంట్లో పనివాళ్లతోనూ బెదిరించి సెక్స్ చేశారని.. పైగా వీటిని వీడియోలు తీశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలు.. వాస్తవాలు.. ఏవైనా కానీ.. బయటకు రాగానే ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిపోయారు.
అయితే.. దీనిపై ఇప్పటి వరకు పెద్దగా స్పందించని కుమారస్వామి.. హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి.. ''తప్పు చేయకపోతే.. దేశానికి తిరిగిరా.. పారిపోవడం ఎందుకు'' అంటూ.. కొడుకు వరసైన ప్రజ్వల్‌కు పిలుపునిచ్చారు. కానీ.. దీనిలోనే అసలు రాజకీయం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజ్వల్ నిర్వాకంతో జేడీఎస్ పార్టీ తీవ్ర చిక్కుల్లో ఉంది. ఈ మచ్చ పార్టీపై నుంచి తొలగించుకునేందుకు గతంలోనే కుమారస్వామి.. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు దేశానికి తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇది కూడా రేవణ్ణను పార్టీలో దూరంగా పెట్టేందుకు.. రేపు పార్టీపై ఆయన ఆధిపత్యం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.
ఇదంతా.. చూస్తే.. తప్పు తమ కుటుంబానిది కాదని.. రేవణ్ణ కుమారుడు, రేవణ్ణదేనని.. పార్టీకి ఎలాంటి సంబందం లేదని చెప్పుకొనే క్రమంలో కుమారస్వామి వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీలో అంతో ఇంతో పట్టున్న రేవణ్ణను మరింత ఒంటరిని చేసే ప్రయత్నమేనని చెబుతున్నారు. మొత్తంగా జేడీఎస్ పై ఇప్పుడు కుమారస్వామి మరింత పట్టు బిగించారని చెబుతున్నారు. దీంతో రేవణ్ణ దాదాపు జేడీఎస్‌లో కరివేపాకు మాదిరిగా ఉన్నారని అంచనాలు వస్తున్నాయి.