Begin typing your search above and press return to search.

ఏపీకి టాటా : కర్నాటక నుంచి రఘువీరా రీ ఎంట్రీ ...?

నాలుగేళ్లుగా తానేంటో తన పొలం పనులు ఏంటో తన వూరు ఏంటో అన్నట్లుగా ఉండిపోయారు నీలకంఠాపురం రఘువీరారెడ్డి

By:  Tupaki Desk   |   26 Aug 2023 9:35 AM GMT
ఏపీకి టాటా :  కర్నాటక నుంచి రఘువీరా రీ ఎంట్రీ  ...?
X

నాలుగేళ్లుగా తానేంటో తన పొలం పనులు ఏంటో తన వూరు ఏంటో అన్నట్లుగా ఉండిపోయారు నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఆయన కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్. 1989లో రాజకీయాల్లోకి వచ్చారు. మడకశిర నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనతో ఆయన కళ్యాణ దుర్గానికి మారి అక్కడ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన కీలకమైన రెవిన్యూ వ్యవసాయ శాఖలను వైఎస్సార్ కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాలలో నిర్వహించారు. విభజన తరువాత ఆయన 2014 నుంచి 2019 దాకా ఏపీ కాంగ్రెస్ ని ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఆ టైంలో రెండు సార్లు పోటీ చేసి ఓడారు. 2019లో ఓటమి తరువాత రఘువీరా రాజకీయ వైరాగ్యంతో ఏకంగా పాలిటిక్స్ కి నమస్కారం పెట్టేశారు.

తన పనులు తాను చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఒక సాధారణ రైతుగా మారిపోయారు. అయితే గత ఏడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనంతపురం జిల్లా మీదుగా వెళ్ళినపుడు రఘువీరాను స్వయంగా పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఆ తరువాత ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు ఎన్నికల పరిశీలకుడుగా సీమను ఆనుకుని ఉన్న జిల్లాలలో రఘువీరా కాంగ్రెస్ తరఫున పనిచేసి ఆ పార్టీ విజయంలో భాగం అయ్యారు

రఘువీరా సీనియర్ గా పార్టీకి సేవ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి కర్నాటకకు చెందిన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆయనను ఏకంగా సీ డబ్య్లూ సీ మెంబర్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ లో అత్యున్నత విధాయక సంస్థ ఇది. కాంగ్రెస్ చేసే అనేక తీర్మానాలలో ఈ కమిటీ ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాంటి కమిటీలో ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే రఘువీరాకు కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ ఆయన నుంచి ఇంకా చాలా ఆశిస్తోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే తనకు ఈ ఉన్నతమైన పదవిని అందించినందుకు కాంగ్రెస్ ని ధన్యవాదాలు తెలియచేసిన రఘువీరా ఇక మీదట పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ ని పటిష్టం చేస్తాను అని అంటున్నారు. ఇక రఘువీరా వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రశ్న అయితే ఉంది.

ఏపీలో చూస్తే కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టుగానే ఉంది. మరిన్ని ఎన్నికల తరువాత కానీ ఆ పార్టీ పూర్వ రూపం లోకి రాలేదు దాంతో రఘువీరా తాను ఉన్న అనంతపురం జిల్లాను ఆనుకుని ఉన్న కర్నాటక పరిధిలోని ఒక కీలకమైన లోక్ సభ సీటు మీద కన్నేశారు అని అంటున్నారు.

అక్కడ నుంచి ఆయన 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తారు అని ప్రచారం అయితే ఉంది. రఘువీరా రెడ్డి సీ డబ్య్లూ సీ మెంబర్. ఆయన జాతీయ పదవిలో ఉన్నారు. దాంతో ఎక్కడ నుంచి అయినా పోటీ చేయవచ్చు. ఈ అవకాశాన్ని వాడుకుని కన్నడ నాట కాంగ్రెస్ లో తనకు ఉన్న పరిచయాలను కూడా ఉపయోగించి రఘువీరా ఆ రాష్ట్రం నుంచి రీ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు.

ఇక ఆయనకు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులతో పాటు డిప్యూటీ సీఈం డీకే శివకుమార్ అండ కూడా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఏపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు నిర్వహించిన రఘువీరా రెండ్డి రీ ఎంట్రీ మాత్రం కన్నడ సీమ నుంచి ఇవ్వాలనుకుంటునారు అన్న ప్రచారం మాత్రం చర్చకు తావిస్తోంది. చూడాలి మరి రఘువీరా కన్నడ నాట ఎలా నెగ్గుకుని వస్తారో.