మా ఆయన నుంచి విడాకులు.. ప్రతినెలా రూ.6 లక్షల భరణం ఇప్పించండి
ఇంతకూ అసలేం జరిగిందంటే.. భర్త నుంచి విడాకులు కోరుతూ కర్ణాటకకు చెందిన ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది.
By: Tupaki Desk | 22 Aug 2024 4:09 AM GMTఒక మహిళ డిమాండ్ కు సదరు న్యాయమూర్తి సైతం అవాక్కుఅయిన ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది. మారిన పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించిన ఒక మహిళ.. ఇందులో భాగంగా భర్త నుంచి ప్రతి నెలా తనకు అందించాల్సిన భరణం గురించి కూడా ఆమె లెక్కలు వేసేసుకొని కోర్టును అడిగేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకూ అసలేం జరిగిందంటే.. భర్త నుంచి విడాకులు కోరుతూ కర్ణాటకకు చెందిన ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం తనకు ప్రతి నెలా రూ.6.16 లక్షల భరణం ఇప్పించాలని కూడా కండీషన్ ను పెట్టేసి న్యాయస్థానాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక వ్యక్తికి భరణం కింద రూ.6 లక్షలకు పైనే అవసరమా? అన్న సందేహాన్ని అడగకముందే.. ఆ లెక్కల్ని కూడా కోర్టు చెప్పేసిన వైనం మరింత ఆసక్తికరంగా మారింది.
తనకు మోకాలి నొప్పులు ఉన్నాయని.. వాటికి ఫిజియో థెరపీ చేయించుకోవటానికి నెలకు రూ.5 లక్షలు.. దుస్తులకు రూ.15 వేలు.. ఇంట్లో భోజనానికి రూ.60 వేలు.. హోటల్ కు భోజనానికి వెళితే మరికొంత ఖర్చు వస్తుందని పేర్కొంటూ ఖర్చుల లెక్కలను కోర్టుకు సమర్పించింది.
ఈ లెక్కను చూసిన సదరు జడ్జి ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. ఒంటరి మహిళ తనకయ్యే ఖర్చుకు సంబంధించిన ఈ లెక్కను సమర్పించిన లాయర్ ను జడ్జి తప్పు పట్టారు. రియలిస్టిక్ లెక్కలతో కోర్టుకు రావాలన్న సలహా ఇచ్చి.. కేసు విచారణను వాయిదా వేశారు. విడాకులు కోరటమే కాదు.. ప్రతి నెలా లక్షల్లో భరణాన్ని కోరుతున్న సదరు మహిళ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.