Begin typing your search above and press return to search.

వారిద్దరిని ఎదుర్కోవడానికే ఠాకూర్‌ కు భారతరత్న!

దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ తర్వాత అత్యధిక లోక్‌ సభా స్థానాలు బీహార్‌ లోనే ఉండటం గమనార్హం

By:  Tupaki Desk   |   24 Jan 2024 1:30 PM GMT
వారిద్దరిని ఎదుర్కోవడానికే ఠాకూర్‌ కు భారతరత్న!
X

కేంద్ర ప్రభుత్వం మరో కొద్ది రోజుల్లో రిపబ్లిక్‌ డేని పురస్కరించుకుని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ కు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతరత్నకు ఈయనను ఎంపిక చేయగానే ఆశ్చర్యపోయినవారే ఎక్కువ. ఈ కర్పూరీ ఠాకూర్‌ ఎవరో మీడియా సర్కిళ్లల్లో పేరొందిన జర్నలిస్టులకు, వివిధ పార్టీల నేతలకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. కర్పూరీ ఠాకూర్‌ ను భారతరత్నకు ఎంపిక చేయగానే ఎవరీయన అనుకుంటూ దాదాపు అంతా గూగుల్‌ లో సెర్చ్‌ చేసినవారే.

కాగా కర్పూరీ ఠాకూర్‌ ను భారతరత్నకు ఎంపిక చేయడం వెనుక ప్రధాని మోడీ– కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యూహం దాగుందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఠాకూర్‌ ను భారతరత్నకు ఎంపిక చేశారని టాక్‌ నడుస్తోంది.

దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ తర్వాత అత్యధిక లోక్‌ సభా స్థానాలు బీహార్‌ లోనే ఉండటం గమనార్హం. బీహార్‌ లో మొత్తం 40 లోక్‌ సభా స్థానాలు ఉన్నాయి.

2019 ఎన్నికల్లో బీజేపీ.. ప్రస్తుత బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తిలతో కలిసి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో 17 ఎంపీ సీట్లను గెలుచుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీయూ 16 సీట్లలో గెలుపొందింది. లోక్‌ జనశక్తి పార్టీ 6 సీట్లలో విజయం సాధించింది. అంటే మొత్తం 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ కూటమికే 39 స్థానాలు దక్కాయి.

అయితే ఆ తర్వాత మారిన పరిణామాలతో నితీశ్‌ కుమార్‌ బీజేపీ కూటమి నుంచి బయటకొచ్చారు. లాలూప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్‌జేడీకి దగ్గరయ్యారు. బీజేపీని విడిచిపెట్టి ఆర్‌జేడీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. వచ్చే ఎన్నికల్లో కూడా జేడీయూ, ఆర్‌జేడీ కలిసి పోటీ చేయనున్నాయి. వీటికి తోడు కాంగ్రెస్‌ పార్టీ కూడా కలిసింది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీహార్‌ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ భారీగా నష్టపోవడం ఖాయం. జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తుండటంతో ఓటు చీలిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే బీహార్‌ ప్రజల మనసులు గెలుచుకోవడానికే మోడీ ప్రభుత్వం కర్పూరీ ఠాకూర్‌ కు భారతరత్న ప్రకటించిందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తద్వారా జేడీయూ కూటమికి చెక్‌ పెట్టొచ్చని భావిస్తున్నారని అంటున్నారు.