చిత్రగుప్తుడి తరహాలో 'సిబిల్' వ్యవహారం... తెరపైకి కీలక అంశాలు!
పైగా క్రెడిట్ హిస్టరీని సరిగ్గా అప్ డేట్ చేస్తున్నారో లేదో తెలియదు.. మధ్య తరగతి ప్రజల జీవితాలను ఈ 'సిబిల్' శాసిస్తుందని చెబుతుంటారు.
By: Tupaki Desk | 5 Dec 2024 4:15 AM GMT'సిబిల్' స్కోరు వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఓ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణకు నిలువుటద్దం అని ఒకరంటే.. అది ప్రైవేటు సంస్థ చేతుల్లోని అద్దమని.. అది బ్రహ్మ పదార్ధమని.. ఓ వ్యక్తి ఆర్థిక చరిత్ర మొత్తం ఆ ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉంటుందని.. ఇది చాలా ప్రమాదమని మరికొంతమంది అంటుంటారు.
పైగా క్రెడిట్ హిస్టరీని సరిగ్గా అప్ డేట్ చేస్తున్నారో లేదో తెలియదు.. మధ్య తరగతి ప్రజల జీవితాలను ఈ 'సిబిల్' శాసిస్తుందని చెబుతుంటారు. ఈ వ్యవహారం వల్ల ఎంతో మందికి లోన్స్ రాకపోవడం వల్ల జీవితాలు తారుమారైన సందర్భాలూ ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.
అవును... భవిష్యత్తులో లోన్ అప్రూవ్ పొందే అవకాశాలను గుర్తించేందుకు భారతీయుల కోసం క్రెడిట్ హిస్టరీని నిర్వహిస్తున్న ప్రైవేటు కంపెనీ "సిబిల్" స్కోర్ ల విశ్వసనీయత, జవాబుదారీతనంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కీలక అంశాలను లేవనెత్తారు. దీంతో... సిబిల్ పై ఆసక్తికర చర్చ మొదలైంది.
ఈ విషయంపై స్పందించిన ఆయన... చిత్రగుప్తుడు ఎలాగైతే ఈ ప్రపంచంలోని మన కార్యకలాపాలన్నింటినీ యమధర్మ రాజుకు లెక్కలు కట్టి చెబుతారో.. మన లావాదేవీలన్నింటినీ రికార్డ్ చేసే సిబిల్ అనే ఏజెన్సీ కూడా చేస్తుంది అని మొదలుపెట్టిన కార్తీ.. ఈ సిబిల్ సంస్థ అసలు ఎలా పని చేస్తుందో ఎవరికీ తెలియదని అన్నారు.
మీరు కారు లోన్ తీసుకోవాలన్నా.. దేశ ఆర్థిక మంత్రి హౌస్ లోన్ తీసుకోవాలన్నా కూడా అంతా సిబిల్ స్కోర్ పైనే ఆధారపడి ఉంటుంది.. అయితే అది ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు.. అది ట్రాన్స్ యూనియన్ అనే ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తుంది అంటూ లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం లేవనెత్తారు.
తమ తమ క్రెడిట్ హిస్టరీ ఆధరంగా ప్రతీ ఒక్కరినీ ఆ సంస్థ రేటింగ్ చేస్తుందని.. కానీ, తమ తమ క్రెడిట్ హిస్టరీని పెర్ ఫెక్ట్ గా అప్ డేట్ చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియదని.. అందులో పాదర్శకత లేదని, తాము అప్పీల్ చేసుకోవడానికీ మార్గం లేదని.. మాకు రేటింగ్ ఇచ్చె కంపెనీ పూర్తి అసమానత మధ్య ఉందని కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక.. తాము బ్యాంకుకు ప్రతీసారి రుణాన్ని సకాలంలో చెల్లించినా కూడా.. సిబిల్ స్కోరు బాగాలేదని.. అసలు తాము సిబిల్ ని ఎలా సంప్రదించాలో తెలియదని అన్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీని.. రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించినప్పుడూ సిబిల్ అప్ డేట్ కావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు!
ఈ సందర్భంగా... ఈ కాంగ్రెస్ ఎంపీ లోక్ సభలో లేవనెత్తిన అంశం ఆసక్తిగా మారింది. చాలా మంది మధ్యతరగతి ప్రజల ఆలోచన, అనుమానం, సమస్యలను ఆయన లేవనెత్తినట్లు అయ్యిందని అంటున్నారు. నెలకు రు.50,000 సంపాదించే వ్యక్తి కూడా సిబిల్ స్కోర్ కారణంగా ఎలాంటి లోన్ పొందలేకపోతున్నాడని అంటున్నారు!
ప్రధానంగా లోన్ లు తీసుకున్న రైతులు.. సబ్సిడీ సొమ్ము అందిన తర్వాత ఆ లోన్ లు చెల్లించినప్పుడు అది క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపించదనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు! మరి దేశంలోని మధ్యతరగతి ప్రజల జీవితాలపై ఓ ప్రైవేటు కంపెనీ చూపిస్తోన్న ప్రభావంపై ప్రభుత్వం ఏ మేరకు స్పందించనుందనేది వేచి చూడాలి.