Begin typing your search above and press return to search.

కరుణానిధి స్మారక నాణెం... తమిళనాట మొదలైన వివాదం!

అవును... తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణేన్ని విడుదల చేసిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 5:03 PM GMT
కరుణానిధి స్మారక నాణెం... తమిళనాట  మొదలైన వివాదం!
X

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణెన్ని ఆదివారం కలైవానర్ ఎరీనాలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ నాణాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాట సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపింది.

అవును... తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి స్మారకార్థం రూపొందించిన 100 రూపాయల నాణేన్ని విడుదల చేసిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి, భారతదేశానికీ కరుణానిధి చేసిన కృషి గురించి వివరించారు. కరుణానిధి స్త్రీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం, లింగ సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.

వాస్తవానికి కే కామరాజు (కాంగ్రెస్), సీఎన్ అన్నదురై (డీఎంకే), ఎంజీ రామచంద్రన్ (ఏఐఏడీఎంకే) సహా తమిళనాడు మాజీ సీఎంల కోసం ప్రత్యేక నాణెం విడుదల చేయబడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం 2023 జూలై 23 న కరుణానిధి స్మారక నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో.. నిర్మలా సీతారామన్ ఈ నాణేల జారీకి అనుమతి ఇస్తూ లేఖపై సంతకం చేసారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరుణానిధి స్మారక నాణెం విడుదల డీఎంకే, బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి సూచనగా ఉందని తెలిపింది! ఈ సందర్భంగా.. ఈ విషయం తాము చాలా కాలంగానే చెబుతున్నాం.. ఈ నాణెం విడుదల బీజేపీ - డీఎంకే మధ్య రహస్య సంబంధాన్ని బట్టయలు చేసింది అని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఏడప్పాడి కె పలైస్వామి అన్నారు.

ఇదే సమయంలో ఈ నాణేన్ని వుడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని డీఎంకే ఎందుకు ఆహ్వానించలేదని ఆయన అడిగారు. ఇదే సమయంలో.. నాణెంలో కరుణానిధి పేరు హిందీలో ఉందంటూ ఆక్షేపించారు.