Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు టీడీపీ మద్దతుపై కాసాని హాట్‌ కామెంట్స్‌!

ఇప్పటికే రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌ లో కలిసి మాట్లాడానని కాసాని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:19 AM GMT
కాంగ్రెస్‌ కు టీడీపీ మద్దతుపై కాసాని హాట్‌ కామెంట్స్‌!
X

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు కావడంతో జైలులో ఉన్నారు. ఇదొక్కటే కాకుండా మరికొన్ని కేసులను కూడా జగన్‌ ప్రభుత్వం ఆయనపై సిద్ధం చేసింది. ఈ అన్ని కేసులకు సంబంధించి చంద్రబాబు బెయిల్‌ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ను అరెస్టు చేయొచ్చని బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పోటీకి ప్రధాన అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

ఇప్పటికే రాజమహేంద్రవరం జైలులో పార్టీ అధినేత చంద్రబాబును ములాఖత్‌ లో కలిసి మాట్లాడానని కాసాని తెలిపారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించానన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని చెప్పారు. తమకు 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఆమోదించాక పేర్లను ప్రకటిస్తామన్నారు. టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారు అని కాసాని జ్ఞానేశ్వర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

తెలంగాణలో టీడీపీ పోటీపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాటిని ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా 119 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిస్తుందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను కాసాని జ్ఞానేశ్వర్‌ ఖండించారు. పార్టీకి సంబంధించి ఏదైనా ఉంటే తానే దానిని మీడియా ముందు ప్రకటిస్తానని తెలిపారు. పుకార్ల ఆధారంగా కథనాలు రాయడం సరికాదన్నారు. టీడీపీ ఎన్నికలకు వెళితే ఓటమి చవిచూడాల్సి వస్తుందన్న భయంతో ఇలాంటి పుకార్లకు పాల్పడుతున్నారని కాసాని ఆరోపించారు.

ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌ పై పోరాడటానికి టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. తాము దానికి కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే టీడీపీ బలంగా ఉందని కాసాని జ్ఞానేశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో తాము జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. పొత్తుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్‌ అని చెప్పారు.

30 మంది అభ్యర్థులతో ముందుగా జాబితాను ప్రకటించినది టీడీపీయేనని కాసాని గుర్తు చేశారు. త్వరలో మిగిలిన 87 మంది అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు. టీడీపీలో చేరేందుకు çపలు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి పెరుగుతున్న ఆదరణతోనే ప్రత్యర్థులు తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని కాసాని జ్ఞానేశ్వర్‌ మండిపడ్డారు.

త్వరలో టీడీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని కాసాని తెలిపారు. ఇది అణగారిన, మహిళలు, యువత, రైతులు, సమాజంలోని అన్ని ఇతర వర్గాల సంక్షేమంతో కూడి ఉంటుందని తెలిపారు. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు.