Begin typing your search above and press return to search.

నేతల గొంతుకోసి, కేడర్ ను తాకట్టుపెట్టి... బాబుకు కాసాని ఘాటు లేఖ!

ఇందులో భాగంగా... తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం తనకు తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:38 PM GMT
నేతల గొంతుకోసి, కేడర్ ను తాకట్టుపెట్టి... బాబుకు కాసాని ఘాటు లేఖ!
X

ఊహించినట్లుగానే జరిగింది! తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. సాధారణంగా పార్టీకి నాయకులు, క్రియాశీల సభ్యులు రాజీనామాలు చేస్తుంటారు. అయితే రొటీన్ కి భిన్నంగా తెలంగాణ టీడీపీకి... ఆ పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాబుకు రాసిన లేఖలో కీలక అంశాలు ప్రస్థావించారు.

అవును... తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నానంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు. ఇందులో భాగంగా... తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం తనకు తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని పేర్కొన్నారు.

తాజాగా చంద్రబాబుకు రాసిన లేఖలో... "నమస్కారం సార్" అంటూ మొదలుపెట్టిన కాసాని... కీలక విషయాలను ప్రస్థావించారు. ఇందులో భాగంగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ తీసుకున్న నిర్ణయం తానొక్కడికే కాకుండా.. పార్టీ శ్రేణులందరికీ తీవ్ర మనోవేధనకు గురిచేస్తోందని అన్నారు. ఈ నిర్ణయం ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని మరోసారి ప్రశ్నార్ధకం చేసేదిగా ఉందని స్పష్టం చేసారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి, పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి, సర్వశక్తులూ ఒడ్డాల్సిన కీలక సమయంలో ఎన్నికల బరినుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది కాదని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీలను పక్కనపెడితే... వామపక్షాలు, బీఎస్పీ, జనసేన వంటి పార్టీలు కూడా పోటీచేస్తున్నాయని గుర్తుచేశారు.

ఈ పరిస్థితుల్లో 40ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయపార్టీ.. తెలంగాణలో ఎన్నికలకు దూరంగా ఉండాలనుకోవడం సహేతుకమైన నిర్ణయం కాదని తెలిపారు. 2014 తర్వాత పార్టీ ముఖ్యనేతలంతా వలస బాట పట్టడం.. 2018లో కాంగ్రెస్ తో కలిసి 13స్థానాల్లో పోటీకే పరిమితం కావడం వల్ల నాయకత్వం చెల్లాచెదురై పార్టీకి తీవ్రనష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ క్రమంలో 2022నాటికి పార్టీ ఉనికే ప్రశ్నార్ధకంగా మారిందని గుర్తుచేశారు.

ఇదే సమయంలో ఇంతకాలం పార్టీ అధినాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఇతర విషయాలు ఆలోచించలేదు కానీ... తాజాగా ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. ఫలితంగా... బీసీలు, అణగారిన వర్గాలను మెజారిటీ సీట్లలో పోటీకి దింపాలన్న తన లక్ష్యం, ఆశయాలు వమ్ము అయ్యయని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు!

అదేవిధంగా... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఈ కష్టకాలంలో తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమైన నాయకులకు కనీసం పార్టీ బీఫాం లు ఇప్పించలేని ఈ పదవిలో ఉండటం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారి. ఇదే సమయంలో... టీడీపీ అధినాకత్వం తీసుకున్న తాజా నిర్ణయం బీసీ, అణగారిన వర్గాల నాయకత్వాన్ని నమ్మించి గొంతుకోసే విధంగా ఉందని భావిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో అక్కడి ప్రయోజనాలకోసం, ఇప్పుడు తెలంగాణలో ఇతర పార్టీల గెలుపుకోసం పార్టీ కేడర్ ను లోపాయకారీగా తాకట్టుపెట్టడం అనైతికమని అన్నారు. ఏది ఏమైనా... పార్టీ అధినేతగా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసేలా తాజాగా తీసుకున్న నిర్ణయంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కాసాని ఆ లేఖలో పేర్కొన్నారు.

దీంతో ఈ లేఖ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో మరో పార్టీని గెలిపించడం కోసం సొంతపార్టీ నేతల గొంతు కోయడం, కేడర్ ను లోపాయకారిగా తాకట్టు పెట్టడం వంటి అనైతిక చర్యలకు హర్ట్ అయ్యానని కాసాని జ్ఞానేశ్వర్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఫలితంగా.. బాబు ఎవరి మేలు కోరి ఈ నిర్ణయం తీసుకున్నారో వారికి ఈ ఎఫెక్ట్ గట్టిగా పడే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలైపోయాయి!