Begin typing your search above and press return to search.

ఎఫ్.బీ.ఐ డైరెక్టర్ గా భగవద్గీతపై ప్రమాణం చేసిన కాశ్ పటేల్

భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతపై ప్రమాణం చేసి ఆయన ఈ అమెరికన్ అత్యున్నత పదవిని స్వీకరించడం విశేషంగా చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 5:59 AM GMT
ఎఫ్.బీ.ఐ డైరెక్టర్ గా భగవద్గీతపై ప్రమాణం చేసిన కాశ్ పటేల్
X

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా నియమితులైన కాశ్ పటేల్ తన మూలాలను మర్చిపోలేదు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతపై ప్రమాణం చేసి ఆయన ఈ అమెరికన్ అత్యున్నత పదవిని స్వీకరించడం విశేషంగా చెప్పొచ్చు.

వైట్‌హౌస్ క్యాంపస్‌లోని ఓ భవనంలో శనివారం (ఫిబ్రవరి 21) కాశ్ పటేల్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొని కాశ్ పటేల్ ప్రతిభను కొనియాడారు. ఆయన దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలు, సేవలను గుర్తుచేశారు. గతంలో కౌంటర్ టెర్రరిజం ప్రాసిక్యూటర్ గా పనిచేసిన కాశ్ ను ఎఫ్.బీఐ డైరెక్టర్ గా నియమించడంపై డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పై కేసులను వాదించి ఆయన్ను విముక్తి చేయడంలో కాశ్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయనకు ఈ కీలక పదవిని ట్రంప్ కట్టబెట్టారు.

కాశ్ పటేల్ నియామకాన్ని అమెరికా సెనేట్ గత శుక్రవారం అధికారికంగా ఆమోదించింది. భారతీయ మూలాలున్న కాశ్ పటేల్ ఈ అత్యున్నత పదవికి ఎదగడం భారతీయ అమెరికన్లకు గర్వకారణంగా మారింది.

-కాశ్ పటేల్ ప్రస్థానం

కాశ్ పటేల్ ఒక భారతీయ మూలాలున్న అమెరికన్ న్యాయవాది.. భద్రతా నిపుణుడు. గుజరాతీ మూలాలు ఉన్న కాశ్ పటేల్ తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. న్యూయార్క్ లో కాశ్ పటేల్ జన్మించారు. న్యాయశాస్త్రం చదివిన ఆయన అమెరికా న్యాయవ్యవస్థలో కీలకమైన స్థానాలను అధిరోహించారు. పలు కీలక భద్రతా వ్యవహారాల్లో ఆయన పని చేశారు. ఇప్పుడు ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

-భారతీయులకు గర్వకారణం

కాశ్ పటేల్ తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ, భగవద్గీతపై ప్రమాణం చేయడం ద్వారా ఆయన తన కుటుంబ మూలాలను గుర్తు చేసుకున్నారు. భారతీయ సంప్రదాయాలు, నైతిక విలువలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయని కాశ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఈ నియామకం భారతీయ అమెరికన్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భవిష్యత్తులో మరింతమంది భారతీయులు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించేలా మారాలని ఆశాభావం వ్యక్తమవుతోంది.