కాశ్మీర్ ఇష్యూ : సుప్రీం కోర్టు తీర్పు పై ఉత్కంఠ
దాని వల్ల కాశ్మీరు కి గడచిన డెబ్బై ఏళ్లుగా ఆస్తిగా వచ్చిన స్వయం ప్రతిపత్తి పోయింది. ఆ వెంటనే కాశ్మీర్ ని రెండు ముక్కలు చేశారు.
By: Tupaki Desk | 5 Sep 2023 6:45 PM GMTసరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవ మారు అధికారంలోకి వచ్చిన వెంటేనే 2019 ఆగస్ట్ 5, 6 తేదీలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ 370 ఆర్టికల్ ని రద్దు చేశారు. దాని వల్ల కాశ్మీరు కి గడచిన డెబ్బై ఏళ్లుగా ఆస్తిగా వచ్చిన స్వయం ప్రతిపత్తి పోయింది. ఆ వెంటనే కాశ్మీర్ ని రెండు ముక్కలు చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ని అలాగే లఢక్ ని చేశారు. ఇది నాలుగేళ్లుగా సాగుతోంది. కేంద్ర పాలనలో కాశ్మీర్ ఉంది. కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని చాలా సార్లు బీజేపీ పెద్దలు చెప్పినా కూడా ఆచరణలో మాత్రం అడుగులు పడడంలేదు.
ఈ నేపధ్యంలో 370 ఆర్టికల్ రద్దు మీద రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణ కోసం పిటిషన్లు పెట్టిన వారు ఉన్నారు. అలా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశం మీద పదహారు రోజుల పాటు విచారణ జరిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ వంటి వారు ఉన్నారు.
మరో వైపు చూస్తే సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, గోపాల్ సుబ్రమణియం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే తదితరులు పదునైన వాదనలను దీని మీద వినిపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి గిరి తదితరులు తమ వాదనలను వినిపించారు. వాటిని సైతం సుప్రీంకోర్టు సావధానంగా విన్నది.
ఇక ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు జులై 27 వరకు స్వీకరించింది. ఆ తర్వాత అగస్ట్ 2వ తేదీ నుండి పూర్తిస్థాయిలో విచారణను ప్రారంభించింది. సోమ, శుక్రవారాలు మినహా మిగతా రోజుల్లో పిటిషన్లపై రోజువారీ విచారణను చేపట్టింది. ఇలా అటూ ఇటూ సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి అవసరం ఉందని వాదించే వారు ఒక వైపు అది రద్దు చేయడం సబబు అన్న వారు మరో వైపు తమ వాదనలను గట్టిగానే వినిపించారు.
మరి దీని మీద రాజ్యాంగ ధర్మాసనం అయితే తీర్పుని రిజర్వ్ చేసింది. ఎపుడు వెల్లడిస్తుంది అన్నది తెలియదు. కానీ ఈ తీర్పు వెలువడితే మాత్రం ఆ రోజున సంచలనమే అవుతుంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న 370 ఆర్టికల్ రద్దు చేసింది. తిరిగి నాలుగేళ్ల తరువాత దాని మీద సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏ గొడవా ఉండదు, కానీ వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం బీజేపీ పూర్వ రూపం అయిన జనసంఘ్ కాలం నుంచి వాదిస్తూ వచ్చిన 370 ఆర్టికల్ రద్దు విషయంలో బీజేపీ గెలిచి ఓడినట్లు అవుతుంది. మరి రాజ్యంగ ధర్మాసనం తీర్పు ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ తీర్పు మీద సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది అని అంటున్నారు.