కశ్మీర్ లో ఉగ్ర మూకల దుశ్చర్య... అమరులైన ఐదుగురు జవాన్లు!
కశ్మీర్ లో మరోసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి.. సైనిక వాహనంపై అకస్మికంగా దాడి చేశాయి
By: Tupaki Desk | 9 July 2024 5:58 AM GMTకశ్మీర్ లో మరోసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి.. సైనిక వాహనంపై అకస్మికంగా దాడి చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు చెబుతున్న ఈ దాడిలో... సైనిక వాహనంపైకి గ్రనేడ్ విసిరి, అనంతరం కాల్పులు జరిపి, సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అంటున్నారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలవ్వగా... వారిలో ఐదుగురి పరిస్థితి విషమించి మృతి చెందారు!
అవును... జమూ కశ్మీర్ లో భారత సైనికులపై ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా సైనిక వాహనంపై గ్రనేడ్ తో దాడి చేసి, కాల్పులు జరిపారు. కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మచేడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాచేడి - కిండ్లీ – మళార్ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రమూకలు గ్రనైడ్ విసిరి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో గాయపడిన 10 మందిలోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన అధికారులు.. అనంతరం ఆ ఐదుగురూ మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన జవాన్లకు ఆర్మీ అస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిలో జూనియర్ కమీషన్డ్ అధికారి ఉన్నట్లు వెల్లడించారు.
మరోపక్క ఈ కాల్పుల ఘటన అనంతరం పోలీసులు, పారామిలటరీ దళయం సాయంతో సైనిక సిబ్బంది ఎదురుదాడికి దిగారు. దీంతో... ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో... అదనపు బలగాలకు అక్కడికి చేరుకుని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు వివరించారు.
ఇక, ముగ్గురు ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని.. వారి వద్ద భారీ స్థాయిలో ఆద్యుధాలు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఈ దాడికి పాల్పడింది తామే అని పాకిస్థాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అనుబంధ ముఠా అయిన కశ్మీర్ టైగర్స్ ప్రకటించుకుంది.