Begin typing your search above and press return to search.

సైబర్ సెక్యూరిటీ ముప్పు..రష్యన్ సంస్థపై అమెరికా వేటు

ప్రపంచాన్ని గడగడలాడించే అతి శక్తివంతమైన దేశాలలో ప్రముఖమైనవి అమెరికా, రష్యా

By:  Tupaki Desk   |   21 Jun 2024 12:30 PM GMT
సైబర్ సెక్యూరిటీ ముప్పు..రష్యన్ సంస్థపై అమెరికా వేటు
X

ప్రపంచాన్ని గడగడలాడించే అతి శక్తివంతమైన దేశాలలో ప్రముఖమైనవి అమెరికా, రష్యా. పైకి చూడడానికి ఈ రెండు దేశాల మధ్య అంతా బాగానే ఉంది అనిపిస్తున్నప్పటికీ..ఈ రెండు దేశాల మధ్య కంటికి కనిపించని హై టెన్షన్ నెలకొని ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘటన ఈ విషయాన్ని మరింత బలపరుస్తుంది. రష్యా‌కు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్వేర్‌పై అమెరికా తీసుకున్న సంచలన నిర్ణయం టాక్ అఫ్ ది నేషన్‌గా మారింది.

కాస్పర్‌స్కై ( Kasper Sky) అనే రష్యన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఉత్పత్తులను తమ దేశంలో అందించడానికి వీలు లేదు అంటూ అమెరికా వాణిజ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు కాస్పర్‌స్కై యాంటీవైరస్ ఉత్పత్తులపై నిషేధాన్ని కూడా విధించింది. ఇదివరకే ఉపయోగంలో ఉన్న ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్‌కు ఎటువంటి నవీకరణలు అందించడానికి వీలు లేదు అని కూడా పేర్కొంది. సాధారణ ఇతర కార్యకలాపాలతో పాటుగా యునైటెడ్ స్టేట్స్ లోపల కాస్పర్‌స్కై ఉత్పత్తులు అమ్మడానికి వీలు లేదు అంటూ అమెరికా వాణిజ్య శాఖ ప్రకటన ద్వారా తెలియపరచింది.

దీనికి కారణం డేటా సెక్యూరిటీ అని అమెరికా పేర్కొంటుంది. ఎందుకంటే ఎంతో సున్నితమైనటువంటి అమెరికన్ సమాచారాన్ని సేకరించి.. దాన్ని తిరిగి తమ దేశంపై ఆయుధంగా మార్చడానికి కాస్పర్‌స్కై ల్యాబ్ లాంటి రష్యన్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు తమ పౌరులకు, వారి భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తామని.. అటువంటి సమయాలలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని స్పష్టం చేశారు.

కాస్పర్‌స్కై యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అమ్మకాలను నిషేధించడంతోపాటుగా, ఆ సంస్థకు అనుసంధానమై ఉన్న మరొక మూడు సంస్థల పై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతకు ఆందోళన కలిగిస్తాయి అని భావించే సంస్థల జాబితాలో ఈ మూడు సంస్థల పేర్లను అమెరికా వాణిజ్య శాఖ చేర్చింది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఈ ఏడాది సెప్టెంబర్ 29 వరకు అమెరికాలో యాంటీవైరస్ అప్డేట్లు అందించడానికి కాస్పర్‌స్కై సంస్థకు అనుమతి ఇచ్చారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మాస్కోలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా 31 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి. 200కు పైగా దేశాలలో ఈ యాంటీవైరస్ ను ఉపయోగించే కస్టమర్ల సంఖ్య సుమారు 400 మిలియన్లకు పైగా ఉంది.2,70,000 కార్పొరేట్ క్లైంట్స్‌కు ఈ సంస్థ సేవలు అందిస్తోంది.

ఇంట్లో వాడే కంప్యూటర్ దగ్గర నుంచి ఐటీ ఇండస్ట్రీలో వాడే లాప్టాప్‌ల వరకు బాగా పాపులర్ అయిన ఈ సంస్థ పై అమెరికా తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే వీటన్నిటి మధ్యలో ఈ సంస్థ భవిష్యత్తుపై కూడా పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమెరికా బాటలోనే మరికొన్ని దేశాలు పయనిస్తే ఈ సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారడం ఖాయం.