Begin typing your search above and press return to search.

వైసీపీ ఓటమికి ఇవే అసలు కారణాలు.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Jun 2024 5:47 AM GMT
వైసీపీ ఓటమికి ఇవే అసలు కారణాలు.. మాజీ  ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓటమికి పలువురూ పలు కారణాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈవీఎం లపైనా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ అయితే... శకుని పాచికల మాదిరి ఫలితాలంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ సమయంలో ఆ పార్టీ కీలక నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఇప్పటికీ ఆ పార్టీనేతలు అంగీకరించడం లేదనేది తెలిసిన విషయమే. అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని ఒకరంటే.. ఈవీఎంలను తప్పుపట్టేవారు మరొకరు..! ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషించారు.

ఈ మేరకు వైసీపీ ఓటమికి, కూటమి గెలుపుకూ ఇవే కారణాలని చెబుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో భాగంగా... గడిచిన రెండు వారాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చి తనను కలుస్తూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారని.. ఇంత అభివృద్ధి, సంక్షేమం చేసినా.. గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నా.. ఎందుకు ఓడిపోయామని అడుగుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరికీ చెప్పేది ఒక్కటే... రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఓటమినీ స్పోర్టివ్ గా తీసుకోవాలి.. ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వర్తించాలి.. అని చెబుతూనే ఓడిపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలున్నాయని తెలిపారు కాసు మహేష్ రెడ్డి. సంక్షేమం బ్రహ్మాండంగా చేసినా లోపలు ఉన్నాయని అన్నారు!

ఇందులో భాగంగా... ప్రధానంగా మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనేది వాస్తవమని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికీ అనేసార్లు చెప్పినా.. దురదృష్టవసాత్తు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కుండబద్దలు కొట్టారు! దాని పర్యవసానమే నేడు కనిపిస్తోందని అంగీకరించారు!

వాస్తవానికి రోజూ కనీసం 20 నుంచి 25 శాతం మంది మద్యం తాగుతుంటారని.. అయితే నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ టీడీపీ చేసిన ప్రచారాన్ని వాళ్లంతా నమ్మారని అన్నారు. ఇదే సమయంలో... ఇసుక మీద ఆధారపడేవాళ్లు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని మహేష్ రెడ్డి తెలిపారు.

ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టిందని అన్నారు. వీటన్నిటితో పాటు అంతకంటే ముఖ్యంగా నాడు జగన్ పార్టీ పెట్టడానికి, వైసీపీ అధికారంలోకి రావడానికి.. నేడు చంద్రబాబు గెలవడానికీ ఒకటే కారణం అని, అది అవమానం అని.. ఆ అవమానమే మనిషిలో కసిని పెంచుతుందని.. మనిషిలో పోరాట పటిమను పెంచుతుందని.. ఇదే విషయాన్ని చరిత్ర చెబుతుందని మహేష్ తెలిపారు.

ఇందులో భాగంగా నాడు వైఎస్ జగన్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించి జైల్లో పెడితే వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగిందని.. అదే విధంగా చంద్రబాబుని జైల్లో పెట్టడాన్ని టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించారని.. కసితో పనిచేశారని.. ఫలితంగా గెలిపించుకున్నారని కాసు మహేష్ రెడ్డి విశ్లేషించారు. దీంతో... ఇది పెర్ఫెక్ట్ పోస్ట్ మార్టం అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు, పరిశీలకులు.