Begin typing your search above and press return to search.

జనసైనికుడి అత్యుత్సాహం.. కాటసాని మార్కు ట్రీట్ మెంట్

ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతోఎన్నికల హామీల్ని ఇస్తున్న వైనం తెలిసిందే

By:  Tupaki Desk   |   21 April 2024 5:23 AM GMT
జనసైనికుడి అత్యుత్సాహం.. కాటసాని మార్కు ట్రీట్ మెంట్
X

రాజకీయాలు అన్న తర్వాత ఎవరి వాదన వారిది. ఎవరి మాట వారిది. ఎవరికి వారు తమ గురించి గొప్పగా.. ప్రత్యర్థి గురించి తప్పుగా చెప్పటం.. ప్రచారం చేసుకోవటం కామన్. ఇలాంటి వేళ.. ఎవరి ప్లాట్ ఫాం మీద వారు మాట్లాడుకోవాలి. అందుకు భిన్నంగా గీత దాటితే పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతుంటాయి. అందుకు తగ్గట్లే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామం ఉద్రిక్తతకు దారి తీసింది.

ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతోఎన్నికల హామీల్ని ఇస్తున్న వైనం తెలిసిందే. అయితే.. సూపర్ సిక్స్ పథకాలు రద్దు అయినట్లుగా పేర్కొంటూ నంద్యాల జిల్లా పాణ్యం వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చారు. కల్లూరు మండలం తడకనపల్లెలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని అక్కడే ఉన్న జనసైనికుడు సలాం స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తారేంటంటూ.. ప్రచార వాహనం మీదకు వచ్చే ప్రయత్నం చేస్తూ ప్రశ్నించారు.

తప్పుడు ప్రచారం చేయొద్దు.. సూపర్ సిక్స్ రద్దు కాలేదంటూ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న సలాం విరుచుకుపడటంతో కాటసాని అనుచరులు స్పందించారు. తమ ప్రచారం వద్దకు వచ్చి.. ఈ మాటలేంది? అంటూ అతడ్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తగ్గని అతడిపై కాటసాని వర్గీయులు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది.

తమ ఊరికి ప్రచారానికి వచ్చి తమ మీదనే దాడి చేస్తారా? అంటూ కాటసాని వర్గీయుల తీరును తప్పు పడుతూ.. గ్రామానికి చెందిన 300 మంది కాటసాని ప్రచార వాహనానికి అడ్డుకోవటంతో పరిస్థితి మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఊళ్లోకి ప్రచారానికి వచ్చి దాడులకు తెగబడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో జనసైనికులు అడ్డుకోకున్నా.. ఆవేశంతో ప్రశ్నించకుండా ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? అన్న ప్రశ్న ఎదురవుతోంది.

గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చారు. ఆందోళన చేస్తున్న జనసేన వర్గీయులను ఇళ్లకు పంపేశారు. నిరసన సరికాదంటూ వారి తీరును తప్పు పట్టారు. తమపై దాడి చేసిన కాటసాని వర్గీయులపై చర్యలు తీసుకోరేమిటంటూ నిరసనకారులు మండిపడ్డారు. అయితే.. తన సమక్షంలో జరుగుతున్న దాడిని వారించకుండా కాటసాని చూస్తూండిపోయిన తీరును తప్పు పడుతున్నారు. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా.. ఎన్నికల వేళ కాస్తంత శాంతంగా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. కాటసాని అండ్ కోకు ఆ మాటలు వినిపిస్తాయంటారా?