ఉద్రిక్తంగా మారిన కౌశిక్ రెడ్డి ధర్నా... కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని నిలదీశారు.
By: Tupaki Desk | 9 Nov 2024 12:44 PM GMTగతంలో బీఆరెస్స్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో దళిత బంధు ఒకటనే సంగతి తెలిసిందే. అయితే... తెలంగాణలో దళిత బిడ్డలకు కేసీఆర్ దళితబంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి రూ.12 లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేశారని బీఆరెస్స్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు పిలుపు నిచ్చారు.. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది.
అవును... బీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో ధర్నా చేపట్టారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ దళిత కుటుంబాలతో కలిసి బీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఈ ధర్నా నివహించేందుకు వస్తుండగా తోపులాట చోటుచేసుకొంది!
ఈ తోపులాటలో ఓ మహిళకు స్వల్పగాయాలు అయ్యాయి. అనంతరం ఆ చౌరస్తా వద్ద సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో.. కరీంనగర్ - వరంగల్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో శ్వాస తీసుకొవడంలో ఇబ్బంది వస్తుండటంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా స్పందించిన కౌశిక్ రెడ్డి.. తన చేయి విరగ్గొట్టినా పర్లేదని, తనను చంపినా పర్లేదని.. కానీ, దళిత బిడ్డలకు మాత్రం దళితబంధు ఇవ్వాల్సిందేనని.. లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రూ.12 లక్షలు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని.. ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఈ విధంగా దాడులు చేయిస్తున్నారని ఫైరయ్యారు.
మరోపక్క ఈ ఘటనపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని నిలదీశారు. ఇదే క్రమంలో... ప్రభుత్వ పెద్దల మెపు పొందేందుకు పోలీసులు పనిచేస్తున్నారని.. తమ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో... బీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని.. అరికెపూడి గాంధీతో అతడిపై దాడికి ప్రయత్నం చేశారని.. ప్రజల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేపై దాడి చేయించే పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. అరెస్ట్ చేసిన బీఆరెస్స్ కారకర్తలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.