Begin typing your search above and press return to search.

160కీ.మీ. వేగంలోనూ ఢీ కొట్టించలేకపోయారు

ఇందులో భాగంగా రైలు ఎదురుగా వస్తున్నంతనే వందే భారత్ రైలు ఆటోమేటిక్ గా బ్రేకులు వేసింది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 9:30 AM GMT
160కీ.మీ. వేగంలోనూ ఢీ కొట్టించలేకపోయారు
X

వేగంగా రెండురైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు జరిగే నష్టం.. చోటు చేసుకునే విషాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా రెండు రైళ్లు ఢీ కొట్టుకోకుండా ఉండేందుకు వీలుగా సిద్ధం చేసిన 'కవచ్' టెక్నాలజీని తాజాగా పరీక్షించి చూశారు. తొలిసారి వందేభారత్ రైలుపై ఈ పరీక్షను నిర్వహించగా సక్సెస్ అయ్యింది. గంటకు 160కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్న వందేభారత్ ట్రైన్ ను మరో ట్రైన్ ఎదురుగా వచ్చేలా చేశారు. ఈ సందర్భంగా ఈ రైళ్లలో కవచ్ సాంకేతికతను వినియోగించారు.

ఇందులో భాగంగా రైలు ఎదురుగా వస్తున్నంతనే వందే భారత్ రైలు ఆటోమేటిక్ గా బ్రేకులు వేసింది. 8 బోగీలు ఉన్న వందే భారత్ ట్రైన్ ను పరీక్ష కోసం పట్టాలెక్కించారు. అత్యవసర సమయంలో లోకో పైలెట్ బ్రేకులు వేయకుంటే ఈ టెక్నాలజీతో సదరు రైలు తనకు తానే ఆగేలా దీన్ని రూపొందించారు.

ఉత్తరప్రదేశ్ లోని మథుర - పాల్వాల్ మధ్య తాజాగా పరీక్షను నిర్వహించగా.. ఇది విజయవంతమైంది. పరీక్షలో భాగంగా ట్రైన్ ను గంటకు 160కి.మీ. వేగంతో నడిపారు. ఈ క్రమంలో లోకో పైలెట్ బ్రేకులు వేయటేలుద. అయితే.. ఇందులోని కవచ్ వ్యవస్థ రెడ్ స్నిగల్ ను గుర్తించి తనకు తాను బ్రేకులు వేసుకుంది. సిగ్నల్ కు పది మీటర్ల దూరంలో రైలును ఆపేసింది. తాజా ప్రయోగం ఆధారంగా దేశ వ్యాప్తంగా ఎనిమిది బోగీలు ఉన్న వందే భారత్ ట్రైన్ లలో కవచ్ వ్యవస్థకు ప్రమాణాలు ఖరారు చేయనున్నారు.

కవచ్ వ్యవస్థలో భాగంగా స్టేషన్ కవచ్.. పట్టాల వెంట ఆర్ ఎఫ్ ఐడీ ట్యాగ్ లు.. కవచ్ టవర్లు అవసరమవుతాయి. వీటిని దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. తాజాగా 8బోగీలున్న వందే భారత్ రైలు కవచ్ పరీక్షలో విజయవంతమైన నేపథ్యంలో పదహారు బోగీలు ఉన్న వందే భారత్ రైళ్లలో దీన్ని పరీక్షిస్తారు.