Begin typing your search above and press return to search.

కవిత లాయర్ ఫీజు నిమిషానికి ఎంతో తెలుసా?

తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Aug 2024 5:04 AM GMT
కవిత లాయర్ ఫీజు నిమిషానికి ఎంతో తెలుసా?
X

తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. దీంతో సుమారు ఐదున్నర నెలలు తీహార్ జైల్లో ఉన్న ఆమె మంగళవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల్లోనూ, బీఆరెస్స్ పార్టీ శ్రేణుల్లోనూ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

అయితే... ఈ కేసులో ఇన్ని రోజుల తర్వాత అయినా కవితకు కండిషన్స్ తో కూడిన బెయిల్ రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంత కీలక కేసులో కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ఎవరు.. ఆయన ఫీజు ఎంత.. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ వచ్చింది. ఈ మేరకు ఆమె పిటిషన్ పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు కండిషన్స్ తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సమయంలో... దర్యాప్తు సంస్థల తరుపున అడిషనల్ సొలిసరేట్ జనరల్ ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు.

మరోవైపు కవిత తరుపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా... కవిత బెయిల్ కు అర్హురాలని ఆయన తెలిపారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని.. ఈ కేసులో రూ.100 కోట్లు చేతులు మారాయనేది కేవలం ఆరోపణ మాత్రమేనని అన్నారు.

ఇదే క్రమంలో... కవిత ఎవరినీ బెదిరించలేదని.. ఈ కేసులో ఇప్పటికే 493 మంది సాక్షుల విచారణ పూర్తయ్యిందని.. ఈ క్రమంలో ఆమె గత 153 రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తోందని కోర్టుకు తెలిపారు రోహిత్గీ. ఇక.. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని అన్నారు.

ఈ సమయంలో... ఈడీ నుంచి నోటీసులు రాగానే ఆమె ఫోన్లు అన్నీ ద్వంసమయ్యాయని ఈడీ తరుపు న్యాయవాది ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రోహిత్గీ... ప్రజలు ఫోన్లు, కార్లు అప్పుడప్పుడూ మార్చుకోవడం మామూలేనని బదులిచ్చారు. ఈ సందర్భంగా కవిత కు బెయిల్ పొందే అర్హత ఉందని తన వాదనలను బలంగా వినిపించారు.

ఎవరీ లాయర్ ముకుల్ రోహత్గీ?:

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడంతో ముకుల్ రోహత్గీ గురించిన చర్చ మరోసారి దేశవ్యాప్తంగా నడుస్తోంది. ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో ఎల్.ఎల్.బీ పూర్తి చేసిన రోహిత్గీ... అనంతరం ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.

ఈ క్రమంలో లాయర్ వసుధ రోహత్గీని వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ రోగత్గీ, సమీర్ రోహత్గీ అని ఇద్దరు కుమారులున్నారు. ముకుల్ రోహత్గీని 1999 నవంబర్ లో ఐదేళ్ల పాటు భారత అడిషినల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది భారత ప్రభుత్వం. అనంతరం 2014 నుంచి 2017 వరకూ భారత అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు.

ఈయన తన పదవీకాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు, ఆధార్ కేసు వంటి పలు విజయవంతమైన కేసులను వాదించారు. ఈయన గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానూ పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ కేసులే ఈయన వాదిస్తారనే పేరు ఉందని అంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తెప్పించిందీ రోహిత్గీనే కాగా... గతంలో జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించినవారిలో రాం జఠ్మలానీ తర్వాత ముకుల్ రోహత్గీదే కీలక పాత్ర అని చెబుతుంటారు.

ఈ క్రమంలో ఈయన గంటకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు వరకూ ఫీజు తీసుకుంటారని చెబుతుంటారు. అది కేసు తీవ్రతపై ఆధారపడి ఉంటుందని అంటారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి రూ.17 వేల చొప్పున ఫీజు వసూలు చేశారని చెబుతున్నారు.