తెలంగాణ తల్లి విగ్రహంపై కవిత సంచలన వ్యాఖ్యలు..
అందుకే.. కనీవినీ ఎరుగని రీతిలో.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ఉత్సవంగా జరిపామని అంటున్నారు.
By: Tupaki Desk | 10 Dec 2024 9:57 AM GMTకాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అట్టహాసంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. గత పదేళ్లుగా గత ప్రభుత్వం తెలంగాణ తల్లిని గుర్తించలేదని, అందుకే.. ఒక రూపం తీసుకురాలేకపోయిందని కాంగ్రెస్ పాలకులు విమర్శించారు. అధికారికంగా ఎక్కడా ప్రతిష్టించలేదని, అందుకే తాము తెలంగాణ తల్లికి ఒక రూపం తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. అందుకే.. కనీవినీ ఎరుగని రీతిలో.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ఉత్సవంగా జరిపామని అంటున్నారు.
నిన్న సచివాలయంలో 17 అడుగుల తెలంగాణ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి రూపం అధికారికం అని ప్రకటించారు. అందుకు చీఫ్ సెక్రటరీ ఓ జీవోను సైతం జారీ చేశారు. అంతేకాదు.. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా రేవంత్ ప్రకటించారు. ఇక.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నది. తమ మీద కోపంతో పిచ్చి పనులు చేయొద్దంటూ చెబుతోంది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, సీఎం రేవంత్ కానీ ఎక్కడా తగ్గకుండా తాము అనుకున్న పనిని చేసి చూపించారు.
ఇక.. తాజాగా ఎమ్మెల్సీ కవిత వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోభాగంగా పంచామృతంతో తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి అభిసేకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులతో రేవంత్ రెడ్డి పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. వారితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదన్నారు. ఉద్యమకారులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీ గురువు చంద్రబాబును అడుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో తెలంగాణ జాతరలు, ఆడబిడ్డల పేర్లు తీయలేదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం మాత్రమే పెట్టారని మండిపడ్డారు. టీజీ అని గుర్తించిన రేవంత్.. ఉద్యమకారులంతా కలిసి తయారుచేసుకున్న విగ్రహాన్ని ఎందుకు మార్చారని నిలదీశారు.
ప్రపంచ వ్యాప్తంగా అందరూ పూలతో దేవుడిని పూజిస్తారని, కానీ తెలంగాణలో మాత్రం పూలనే దేవుడిగా పూజిస్తామని కవిత చెప్పారు. అలాటి యూనిక్ ఐటెంటిటితో ఉన్న బతుకమ్మను మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మను మాయం చేసి కాంగ్రెస్ హస్తం గుర్తు పెట్టారని మండిపడ్డారు. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీద తల్లిని తెలంగాణ తల్లిగా పెట్టారని.. అంటే తెలంగాణ మహిళలు ఎదగడం ఇష్టం లేదా..? అని నిలదీశారు. తల్లి గొప్పగా ఉండాలి.. కానీ మీరు కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన విగ్రహంలో ఏం ప్రత్యేక ఉందని ప్రశ్నించారు. జొన్నలు, మక్కలు తమిళనాడు, కర్ణాటకలో పండించరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులకు నజరానా ఇస్తామని ప్రకటించారని, మహిళలకు విగ్రహాలు పెట్టి పురుషులకు వరాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సంధ్య, విమలక్క, ఇతర తెలంగాణ మహిళామణులకు గుర్తింపు ఏదని ప్రశ్నించారు.