Begin typing your search above and press return to search.

కేరళ లిక్కర్ స్కాంలో కవిత? కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై కేరళ కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణ చేశారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 7:30 AM GMT
కేరళ లిక్కర్ స్కాంలో కవిత? కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణ
X

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై కేరళ కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీ తరహాలో తమ రాష్ట్రంలోనూ చోటుచేసుకున్న లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని కేరళ అసెంబ్లీలోనే సతీశన్ విమర్శలు గుప్పించారు. కేరళ సీఎల్పీ లీడర్ అయిన సతీశన్ ఆరోపణలతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కవిత ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను కేరళ కాంగ్రెస్ టార్గెట్ చేయడం సంచలనం రేపుతోంది. గురువారం మీడియాతో మాట్లాడిన సతీశన్ కేరళ లిక్కర్ స్కాంపై పలు వివరాలను వెల్లడించారు. 2023లో ఈ కుంభకోణం చోటుచేసుకున్నట్లు ఆయన తెలిపారు. పాలక్కడ్లోని ఎలపల్లి పంచాయతీలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేశారని, ఆ తర్వాత అనూహ్యంగా మద్యం విధానంలో మార్పులు చేశారని ఆరోపించారు. ఈ విషయంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేశ్ ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతిలిచ్చినట్లు తెలిపారు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని సతీశన్ ఆరోపించారు. కవిత కేరళ వచ్చి ప్రభుత్వ పెద్దలతో చర్చించారని ఆయన తెలిపారు. దీనికి క్యాబినెట్ నోటే ఆధారమని చెప్పారు. ఒయాసిస్ కోసం మద్యం పాలసీ సవరించారని, ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ఆయన వెల్లడించారు. 2023లో పాలసీని ఆమోదించిన వెంటనే.. ఆ కంపెనీకి మద్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులిచ్చారని సతీశన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర ఏంటి? కేరళలో ఆమె ఎక్కడ బస చేశారనే విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, సతీశన్ ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు ఈ ఆరోపణలు నిదర్శనమని కవిత మండిపడ్డారు. కేరళ కాంగ్రెస్ నేతపై తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.