Begin typing your search above and press return to search.

ఈడీతో ఘర్షణకు రెడీ అయ్యారా ?

ఈనెల 16వ తేదీ ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఈడీ నుండి కవితకు నోటీసులు అందిన విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Sep 2023 7:19 AM GMT
ఈడీతో ఘర్షణకు రెడీ అయ్యారా ?
X

ఎన్ఫోర్స్ మెంటు డైరక్టరేట్ తో ఘర్షణకు కల్వకుంట్ల కవిత రెడీ అయ్యారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే విచారణక రమ్మని ఈడీ ఇచ్చిన నోటీసులను కవిత ఖాతరు చేయటంలేదు. తమ లీగల్ టీమ్ విచారణకు హాజరుకావాల్సిన అవసరంలేదని సలహా ఇచ్చినట్లు ఆమె చెబుతున్నారు. నోటీసులను చాలెంజ్ చేస్తు కవిత కోర్టులో పిటీషన్ వేశారు. ఈనెల 16వ తేదీ ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఈడీ నుండి కవితకు నోటీసులు అందిన విషయం అందరికీ తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున ఎంతముంది ఉన్నా కల్వకుంట్ల కవిత పాత్ర చాలా కీలకమని ఇప్పటికే ఈడీ అనేకసార్లు చెప్పింది. కోర్టులో దాఖలుచేసిన రిమాండ్ రిపోర్టుతో పాటు దాఖలుచేసిన ఛార్జిషీట్లలో కూడా కవిత పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నట్లు ఈడీ అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. విచిత్రం ఏమిటంటే స్కామ్ లో పాత్రుందని అనుకున్న చాలామందిని అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం ఇంతకాలం ఎందుకు అరెస్టు చేయలేదో అర్ధంకాలేదు.

కవితకు బినామీలుగా ఉన్నారని అనుమానించిన అరుణ్ రామచంద్ర పిళ్ళై లాంటి వాళ్ళని అరెస్టు చేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు వదిలిపెట్టేసింది ? ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం జరిగింది కాబట్టే అని కాంగ్రెస్ నేతలు, రాహుల్ తెలంగాణా పర్యటనలో పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. జరుగుతున్నది చూసిన జనాలు కూడా కాంగ్రెస్ ఆరోపణలే నిజమని నమ్ముతున్నారు. దానికి తగ్గట్లే అప్పటివరకు నరేంద్రమోడీపై అంతెత్తున ఎగెరిగెరిపడుతున్న కేసీయార్ అసలు మాట్లాడటమే మానేశారు.

ఇదంతా చూసిన తర్వాత మోడీ-కేసీయార్ మధ్య ఒప్పందం జరిగిందనే విషయాన్ని జనాలు నమ్మారు. ఇది బీజేపీని బాగా దెబ్బతీసేసింది. అప్పటివరకు మంచి రైజ్ మీదున్న పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటినుండి పార్టీ గ్రాఫ్ మళ్ళీ లేవలేదు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణా బీజేపీ పాకుతుదేకుతు ఉంది. దాంతో పార్టీని బాగా డ్యామేజ్ చేసిన కవిత ఇష్యూనే వాడుకోవాలని బీజేపీ అనుకున్నట్లుంది. అందుకనే సడెన్ గా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తన మీద పడిన మచ్చను తొలగించుకోవాలంటే బహుశా కవితను ఈడీ అరెస్టు చేసినా చేయచ్చు. ఏమి జరుగుతుందో చూడాల్సిందే.