Begin typing your search above and press return to search.

కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనం... తెరపైకి సరికొత్త చర్చ!

అవినీతి ఆరోపణలు రావడం ఒకెత్తు అయితే... మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం మరొకెత్తని అంటున్నారు

By:  Tupaki Desk   |   20 March 2024 7:15 AM GMT
కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనం... తెరపైకి సరికొత్త చర్చ!
X

తెలంగాణను పదేళ్లపాటు పాలించిన కేసీఆర్ కు ఇప్పుడు సరికొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయని తెలుస్తుంది! గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ఒకెత్తు అయితే... ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం మరో సమస్యగా మారిందని.. ఇదే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటి సంగతి దేవుడెరుగు.. ఈ లోక్ సభ ఎన్నికల్లోనే చతికిలపడే పరిస్థితి వస్తుందా అనే అంశం మరో సమస్యగా ఉందని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఎంతో కొంత మానాలంటే.. కచ్చితంగా లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటడం ఇప్పుడు కేసీఆర్ & కో మందున్న అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి! అయితే... ఆ అవకాశాలకు గండి కొడుతూ.. రేవంత్ రెడ్డి డోర్లు ఓపెన్ చేశారని అంటున్నారు. అవి చాలవన్నట్లుగా... ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఇప్పుడు కేసీఆర్ కు అటు రాజకీయంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ తగిలిన పెద్ద దెబ్బగా చూస్తున్నారని తెలుస్తుంది.

అవినీతి ఆరోపణలు రావడం ఒకెత్తు అయితే... మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం మరొకెత్తని అంటున్నారు. పైగా నిన్నమొన్నటివరకూ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కవిత.. ఇలా మద్యం కుంభకోణంలో అరెస్ట్ కావడం.. ఆమెతోపాటు, తన ప్రతిష్టకు కూడా గణనీయమైన ఇబ్బందిని కలిగించిందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తుంది.

దీంతో... ఏమని స్పందించాలి.. ఎలా స్పందించాలి అనే విషయంలో కేసీఆర్ మీమాంసలో ఉన్నారని, ఇది బీజేపీ కక్షపూరిత చర్యగా అభివర్ణించే పరిస్థితి కూడా దాటేసిందని, అందుకే మౌనాన్నే తన భాషగా చేసుకున్నారని అంటున్నారు. ఆ కారణాలే ప్రస్తుతం కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి కారణం అని... పైగా ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసే పరిస్థితి దాటిపోయిందని భావిస్తున్నారని సమాచారం!!

ఇవి చాలవన్నట్లుగా మరోపక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో అతిపెద్ద సమస్యగా మారిందని... పైగా బీఆరెస్స్ ట్రంప్ కార్డ్ హరీష్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ మీడియాలో కథనాలొస్తున్న వేళ.. ఇది మరింత జటిలమైన సమస్యగా మారబోతుందనే ఆందోళన కేసీఆర్ & కో లో మొదలైందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలోనే మరో ఆప్షన్ లేఖ కేసీఆర్ మౌనంగా ఉన్నారని అంటున్నారు.