ఒకవైపు అలజడి.. మరోవైపు కులాసాగా.. మోడీ రోడ్ షో!
కట్ చేస్తే.. రాష్ట్రంలో ఇంత అలజడి రేగుతుంటే.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చాలా చిద్విలాసంగా రాష్ట్రానికి చేరుకున్నారు
By: Tupaki Desk | 15 March 2024 4:31 PM GMTతెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో తీవ్ర అలజడి రేగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ బీఆర్ ఎస్ నాయకులను అదుపు చేస్తున్నా రు. చాలా జిల్లాల నుంచి బీఆర్ ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చేందుకు నాయకులు రెడీ అయ్యారు. దీంతో వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అన్ని జిల్లాల సరిహద్దుల్లోనూ ప్రత్యేకంగా అప్పటికప్పుడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు వచ్చే వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కట్ చేస్తే.. రాష్ట్రంలో ఇంత అలజడి రేగుతుంటే.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ చాలా చిద్విలాసంగా రాష్ట్రానికి చేరుకున్నారు. బహుశ ఆయనకు కవిత అరెస్టు విషయం చెవిన పడే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన చాలా సంతోషంగా కనిపించడం గమనార్హం. హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు రోడ్ షో కొనసాగనుంది. `విజయ్ సంకల్ప్` పేరుతో బీజేపీ నేతలు ఈ రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు.
రోడ్ షో కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగుతోంది. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ బీజేపీ శ్రేణులు నినదిస్తున్నారు. మోడీ రోడ్ షో సందర్భంగా 2600 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే..ఇప్పుడు ఈ సంఖ్యను మరో 500లు పెంచారు. రోడ్ షో తర్వాత ప్రధాని రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన రాజ్ భవన్ లోనే బస చేస్తారు. కాగా, రాష్ట్రంలో ఇంత అలజడి రేగుతున్నా.. ప్రధాని చాలా చిద్విలాసంగా కనిపించడం గమనార్హం.