కవితకు జైల్లో తీవ్ర అస్వస్థత... హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు!
అవును... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 July 2024 1:29 PM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఆమె సుమారు నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉంటున్నారు. అయితే తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.
అవును... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో తీహార్ జైలు నుంచి హుటాహుటిన ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారని అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా... ఈ ఏడాది మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచీ కవిత తీహార్ జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె బెయిల్ కోసం హరీష్ రావు, కేటీఆర్ లు హస్తినలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం అటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేరు వేరు కేసులు నమోదు చేయగా.. ఆ రెండింటిలోనూ కవిత అరెస్ట్ అయ్యారు! ఇక, ఆమె అస్వస్థతకు గురైందనే వార్తలతో బీఆరెస్స్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.